ఆంధ్రప్రదేశ్

రాయలసీమపై కూటమి గురి.. స్థానిక పోరులో హోరాహోరీ!

రాయలసీమలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ ప్రత్యేకంగా పరిగణిస్తోంది. గతంలో వైఎస్సార్‌సీపీకి బలం ఉన్న ప్రాంతాల్లో ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి : రాష్ట్రంలో కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. అధికార కూటమి తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు పరస్పర విమర్శలతో ప్రచారాన్ని  పోటాపోటీగా నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఆఖరి ప్రయత్నాల్లో భాగంగా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. నవంబరు 1న జరగనున్న పోలింగ్‌పై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ఎన్నికలను అధికార కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. రాయలసీమలోని పట్టణ స్థానిక సంస్థల్లోనూ కూటమి పట్టు సాధించాలని పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు స్థానిక ఎన్నికల గెలుపు బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థుల ఏకగ్రీవంతో అధికార పక్షం ఆధిక్యత ప్రదర్శించింది. అయితే మిగిలిన ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో అసలు పోరుకు పోలింగ్ ఘట్టం వేదిక కానుంది.

ఫోకస్‌ అంతా అక్కడే..

రాయలసీమలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా పరిగణిస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి బలమైన రాజకీయ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత కడప జిల్లాలోని అన్ని మున్సిపల్‌ స్థానాల్లో విజయం సాధించేలా కూటమి నేతలు ఇప్పటికే వ్యూహాలు రచించారు. దీంతో పాటు అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పట్టణ స్థానిక సంస్థలపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

17 చోట్ల ఏకగ్రీవం..

పోలింగ్‌కు ముందే రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ పదవులను కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. ఏకగ్రీవాల్లో తెలుగుదేశం పార్టీకి 15, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి చొప్పున లభించాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరు(టీడీపీ), రాయచోటి(టీడీపీ), వైఎస్సార్‌ కడప జిల్లా రాజంపేట(టీడీపీ), ప్రొద్దుటూరు(టీడీపీ), బద్వేలు (టీడీపీ),  మైదుకూరు(టీడీపీ), కమలాపురం(టీడీపీ), ఎర్రగుంట్ల (బీజేపీ), నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ(టీడీపీ), ఆత్మకూరు(టీడీపీ), అనంతపురం జిల్లా గుత్తి (టీడీపీ), పల్నాడు జిల్లా పిడుగురాళ్ల(టీడీపీ), దాచేపల్లి (టీడీపీ), గురజాల (టీడీపీ), ప్రకాశం జిల్లా కనిగిరి(టీడీపీ), దర్శి (జనసేన) చిత్తూరు జిల్లా నగరి(టీడీపీ) మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలు దక్కించుకున్నాయి.

జగన్‌ సొంత జిల్లాలో కూటమి ఆధిక్యత

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలలో జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని 65 ఎంపీటీసీ స్థానాలకుగాను, ఏకంగా 64 ఎంపీటీసీ స్థానాలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఏడు జడ్పీటీసీలలో మూడింటిని కూటమి ఏకగ్రీవంగా తమ ఖాతాలో వేసుకుని జగన్‌కు షాక్ ఇచ్చింది. పరిషత్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 5న జరుగనుంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ జగన్ సొంత జిల్లా వైఎస్సార్‌ కడపలో కూటమి ఏకగ్రీవ విజయాలు సాధించింది. రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, కమలాపురం మున్సిపాలిటీలతో పాటు ఎర్రగుంట్ల నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ స్థానాలను కూటమి అభ్యర్థులు దక్కించుకోవడం గమనార్హం.

వార్డుల్లోనూ కూటమి జోరు

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 52 వార్డులకు గాను 51 స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకోగా, మిగిలిన ఒక స్థానం బీజేపీ ఖాతాలో చేరింది. బద్వేలులోనూ 40 వార్డులకు గాను టీడీపీ 35, జనసేన రెండు స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. కమలాపురంలో 23 వార్డులకు గాను టీడీపీ 22, బీజేపీ ఒక స్థానంలో ఏకగ్రీవమయ్యాయి. పులివెందులలోనూ 40 వార్డులకు గాను కూటమి 20 స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన వార్డులతో పాటు చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. కడప నగరపాలక సంస్థలో మొత్తం 66 డివిజన్లు ఉండగా, వాటిలో టీడీపీ 47, బీజేపీ రెండు, జనసేన ఒక డివిజన్‌ను ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. చిత్తూరు కార్పొరేషన్‌లోనూ 60 డివిజన్లకు గాను 48 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవ విజయాలతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ, మిగిలిన స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాల్లో రెండు పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.