ఆంధ్రప్రదేశ్

అటు కరువు.. ఇటు తుఫాను ఏపీలో రైతులను ముంచుతున్న విపత్తులు

ఏపీలో కరువు, తుఫాన్‌ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాయలసీమ, కోస్తాంధ్రలో పర్యటిస్తున్నాయి.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి : ఏపీలో ఏకకాలంలో రెండు విపత్తులు రైతులను నిండా ముంచేస్తున్నాయి. నీళ్లు లేక రాయలసీమలో వేరుశనగ చేన్లు ఎండిపోతుంటే, కోస్తా ప్రాంతాల్లో తుఫాన్‌ ధాటికి వరి పొలాలు నీట మునుగుతున్నాయి. ఒకవైపు కరువు, మరోవైపు తుఫాన్‌.. ఈ రెండింటి నేపథ్యంలో కేంద్ర బృందాలు పంట నష్టాలపై ఆరా తీస్తున్నాయి. అనంతపురం జిల్లా ఆత్మకూరు సమీపంలో వయసు మీదపడిన రైతు గంగులయ్య పొలంలో నిలబడి చూస్తున్నాడు. ‘ఈ సారి వర్షం రాకపోతే ఇంట్లో వాళ్లు ఏం తింటారో’ అని ఆవేదనతో అంటుంటే.. అక్కడే ఉన్న కేంద్ర కరువు బృందం సభ్యులు ఆయన నుంచి వివరాలు సేకరించారు. ‘వేరుశనగ చేను ఎండిపోయింది. మా జీవితాలకు ఈ పంటే దిక్కు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు’ అని అధికారులకు చెప్తూ గంగులయ్య కంటతడి పెట్టుకున్నారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 283 మండలాలు తీవ్ర కరువులో, 105 మండలాలు మధ్యస్థ కరువులో ఉన్నాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాయలసీమలోని అనేక మండలాల్లో వర్షాభావం తీవ్రంగా ఉంది. దీంతో పంట నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాయలసీమకు రాగా రైతులు తమ కష్టాలను వారితో చెప్పుకుంటున్నారు. ‘మాకు సాయం చేయండి. కనీసం విత్తనాలు, ఎరువులు ఇవ్వండి’ అని వేడుకుంటున్నారు.

మరోవైపు కోస్తాంధ్రలో అర్నబ్‌ తుఫాన్‌ విధ్వంసం సృష్టించింది. కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కేంద్ర తుఫాన్‌ బృందం పర్యటిస్తోంది. ‘నిన్నటి వరకు పచ్చగా ఉన్న వరి ఇప్పుడు మట్టిలో కలిసిపోయింది. అరటి తోటలు నేలవాలాయి’ అని అమలాపురానికి చెందిన భగవాన్‌ అనే రైతు అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్‌ ధాటికి అంతర్వేదిలో చేపల పడవలు పాడైపోయాయి. ఒక మత్స్యకారుడు మాట్లాడుతూ, ‘పడవ పాడైంది. వలలు పోయాయి. ఇప్పుడు సముద్రంలోకి వెళ్లే పరిస్థితే లేదు’ అని చెప్పారు. తుఫాను కారణంగా కోనసీమలో 3.52 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 4.63 లక్షల మంది రైతులు నష్టపోయారు. మొత్తం రూ.4,764 కోట్ల నష్టం వాటినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికారుల బృందానికి కేంద్ర హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ చిత్తరంజన్‌ దాస్, కరువు ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్న మరో బృందానికి కేంద్ర సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిన్మయ్‌ గోట్మారే నాయకత్వం వహిస్తున్నారు.