ఆంధ్రప్రదేశ్

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 28న మున్సిపల్ ఎన్నికలు, నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.

Aravind Reddy

ప్రభాత ఉదయం, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా బుధవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఈనెల 28న పోలింగ్‌ జరగనున్నది. నామినేషన్ల దాఖలుకు 18 వరకు గడువు విధించారు. 19న నామినేషన్లు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు 21 వరకు అవకాశం ఉంది. ఈనెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.  

నవంబరు3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 19న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 23వరకు గడువు విధించారు. ఉపసంహరణకు 27 వరకు అవకాశం ఉంది. నవంబరు 5న ఫలితాలు వెల్లడించనున్నారు.  పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. నవంబరు 26న మొదటి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగినే రోజే ఓట్ల లెక్కించనున్నారు.