AP Four New Police Commissionerates 
ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో నాలుగు పోలీసు కమిషనరేట్లు

Aravind Reddy
  • గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కర్నూలులో ఏర్పాటు

  • ఆరుకు చేరిన కమిషనరేట్ల సంఖ్య

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు పోలీసు కమిషనరేట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గుంటూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం (రాజమండ్రి) నగరాల్లో పోలీసు కమిషనరేట్ల ఏర్పాటుకు సర్కారు అనుమతులను మంజూరు చేసింది. ఈమేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో పోలీసు కమిషనరేట్ వ్యవస్థ అమల్లో ఉండగా, మరో నాలుగు కొత్త కమిషనరేట్లతో వాటి సంఖ్య ఆరుకు చేరింది. అయితే నూతన కమిషనరేట్ల కోసం ప్రభుత్వం కొత్తగా పోస్టులను సృష్టించలేదు. వీటికి అవసరమైన డీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీసు సిబ్బందిని కూడా ఉన్న పోస్టుల్లోనే సర్దుబాటు చేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వివిధ విభాగాల్లో అదనంగా ఉన్న క్యాడర్ పోస్టులను సర్దుబాటు చేసి కమిషనర్ పోస్టులుగా మార్చనున్నారు. కొత్త కమిషనరేట్లకు ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరించనున్నారు.

కమిషనర్ బాధ్యతలు వీరికే

· విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్‌కు తిరుపతి కమిషనర్‌గా అదనపు బాధ్యతలను కేటాయించారు.

· పోలీసు శిక్షణ విభాగంలోని డీఐజీని గుంటూరు కమిషనర్‌గా కేటాయించారు.

· రాజమహేంద్రవరం, కర్నూలు పోలీసు కమిషనర్ పోస్టులను కూడా ఇతర విభాగాల నుంచి సర్దుబాటు చేయనున్నారు.

గుంటూరులో మూడు జోన్లు

· గుంటూరు కమిషనరేట్ పరిధిలో గుంటూరు, అమరావతి, తెనాలి జోన్లు ఉంటాయి.

· రాజమహేంద్రవరం, కర్నూలు కమిషనరేట్ల పరిధిలో ఆయా నగరాలతో పాటు పరిసర ప్రాంతాలను చేర్చారు.