AP BC Gurukulas Staff Transfers 
ఆంధ్రప్రదేశ్

50 ఏళ్లలోపు పురుష సిబ్బంది బాలికల విద్యాసంస్థల్లో ఉండొద్దు!

Suryanarayana
  • ఏపీ బీసీ గురుకులాల్లో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు

  • 8 ఏళ్లు దాటితే తప్పని సరి

అమరావతి: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. బాలికల గురుకులాల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష ఉద్యోగులు, ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బంది ఉండొద్దని, వారిని వెంటనే బాలుర గురుకులాలకు బదిలీ చేయాలని పేర్కొంది. అలాగే ఒకేచోట 8 ఏళ్లు పూర్తిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సిందేనని నిర్ణయించింది.

 ఆన్‌లైన్‌లోనే..  

ఈ బదిలీల ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధారణ బదిలీల సందర్భంగా వర్తించే అన్ని నిబంధనలూ పాటించాల్సిందేనని పేర్కొంది. అన్ని గురుకులాల్లో రెగ్యులర్ ఉద్యోగుల నిష్పత్తి సమానంగా ఉండేలా ఖాళీలను ప్రకటించడానికి కసరత్తు జరుగుతోంది. మారుమూల గ్రామాల్లోని విద్యా సంస్థల్లోనూ తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు.

 కొందరికి మినహాయింపులు

దృష్టిలోపం ఉన్నవారు, రెండేళ్లలోపు పదవీవిరమణ చేసే ఉద్యోగులను ప్రభుత్వం బదిలీల నుంచి మినహాయించింది. ఒకవేళ స్వచ్ఛందంగా బదిలీ కోరితే అనుమతిస్తుంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, వితంతువులు, భార్యాభర్తల కేసులు లాంటి విషయంలో కూడా  వెసులుబాటు కల్పించారు. అలాగే బదిలీపై తుది నిర్ణయం తీసుకునే అధికారం సొసైటీ కార్యదర్శికి ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చింది.

 ఉద్యోగ భద్రత కల్పించండి

 గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఎం నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అలాంటి వారు మొత్తం 1,673 మంది ఉన్నారని, కానీ ఎవరికీ వేతనాలు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇతర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని కోరారు.