ఆంధ్రప్రదేశ్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ 
ఆంధ్రప్రదేశ్

ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో 70.72 శాతం పోలింగ్

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 70.72 శాతం తుది పోలింగ్‌ నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 82.51 శాతం ఓటింగ్‌ జరిగింది.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి : ఆంధ్రప్రదేశ్​లో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తుది పోలింగ్‌ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 70.72 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా 82.51 శాతం పోలింగ్‌తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 62.01 శాతంతో చివరి స్థానంలో ఉంది. అనకాపల్లి 75.58, ఎన్‌టీఆర్‌ 75.53, ఏలూరు 75.52, నంద్యాల 74.27, శ్రీ సత్యసాయి 73.71, కృష్ణా 73.21, గుంటూరు 73.12, వైఎస్సార్‌ కడప 71.78, తూర్పు గోదావరి 71.56, పల్నాడు 70.93, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 70.62 శాతం పోలింగ్‌ నమోదైంది. అనంతపురం 64.38, పోలవరం 65.48, శ్రీకాకుళం 65.51, డాక్ట్​ బీఆర్​ అంబేద్కర్‌ కోనసీమ 66.33, పార్వతీపురం మన్యం 67.13, బాపట్ల 67.47, మార్కాపురం 67.69, కర్నూలు 68.29, ప్రకాశం 68.53, తిరుపతి 68.67, కాకినాడ 68.94, అన్నమయ్య 69.19, పశ్చిమ గోదావరి 69.73, చిత్తూరు 76.3, విజయనగరంలో 76.21 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇదిలాఉంటే బూత్‌ క్యాప్చరింగ్, బ్యాలెట్‌ పెట్టెల ధ్వంసం వంటి ఘటనల నేపథ్యంలో అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం 365 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. శుక్రవారం ఉదయం 8.00 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. 365 లెక్కింపు కేంద్రాల్లో 9,062 టేబుళ్లను ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి టేబుల్​పై ఒక్కో రౌండ్‌లో వెయ్యి బ్యాలెట్‌ పత్రాలను లెక్కిస్తారని తెలిపారు.