ఆంధ్రప్రదేశ్

నేడు ఏపీ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. 17 చైర్‌పర్సన్‌ పదవులను అధికార కూటమి ఏకగ్రీవంగా దక్కించుకుంది.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి : ఉద్రిక్తతల నడుమ ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఇదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. అక్రమాలు, బూత్‌ క్యాప్చరింగ్‌ తదితర కారణాలతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల సోమవారం రీపోలింగ్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆదివారం పోలింగ్‌ జరిగింది. దాదాపు 61 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల దశలోనే పలు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 17 చైర్‌పర్సన్‌ పదవులను అధికార కూటమి కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీకి 15, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి దక్కాయి. వందలాది వార్డులు, డివిజన్లు కూడా కూటమి పార్టీలకు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవ స్థానాల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ముందంజలో నిలిచింది. వైఎస్​ఆర్‌సీపీకి బలమున్న ప్రాంతాల్లోనూ, ముఖ్యంగా కడప జిల్లాలో, ఆ పార్టీ ఏకగ్రీవ స్థానాలు కోల్పోవడం గమనార్హం. ఓట్ల లెక్కింపుతో మున్సిపల్‌ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.