ఆంధ్రప్రదేశ్

మున్సి‘పోల్స్’లో కూటమి హవా

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హవా కొనసాగింది. కడప, పులివెందులలోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి : ఆంధ్రప్రదేశ్​లో జరిగిన పురపాలక (మున్సిపల్‌) ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు సత్తాచాటారు. ఆయా పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులు కొందరు భారీ మెజార్టీతో విజయం సాధించగా, ఇంకొందరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైఎస్సార్‌సీపీకి కంచుకోటల లాంటి కడప, పులివెందుల స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో  ఈ నెల 1న జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం ఉదయం ప్రారంభమైంది. తుఫాను కారణంగా విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, బాపట్ల, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల కౌంటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. రాత్రి 7.30 గంటల వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా చూస్తే, 13 నగరపాలక సంస్థల్లో కూటమి అభ్యర్థులంతా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఆదోనిలో జనసేన రెబల్‌ విజయం

మున్సిపల్, నగరపాలక సంస్థలకు సంబంధించి టీడీపీ 43 మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానాలను కైవసం చేసుకోగా, మరో 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. జనసేన 14 స్థానాల్లో గెలవగా, 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ మూడు స్థానాల్లో నెగ్గగా, ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నుంచి నంద్యాల జిల్లా నందికొట్కూరు చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎస్‌.ఫాతిమా బీ విజయం సాధించగా, మరో రెండు చోట్ల ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా జనసేన రెబల్‌ అభ్యర్థి స్వప్న నాయకర్‌ విజయం సాధించగా, మరో రెండు చోట్ల స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు. గుంటూరు టీడీపీ మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ 42 వేల ఓట్లు, విశాఖపట్నం మేయర్‌ అభ్యర్థి ముక్కా శ్రావణి 1.20 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

రెండు దశాబ్దాల తర్వాత..

మొత్తం 100 స్థానాలకుగానూ 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మేయర్, చైర్‌పర్సన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. 13 మేయర్‌ స్థానాలకుగానూ టీడీపీ 10, జనసేన 2, బీజేపీ 1 స్థానాల్లో పోటీ పడగా, వైఎస్సార్‌సీపీ 13 చోట్లా బరిలోకి దిగింది. 87 చైర్‌పర్సన్‌ స్థానాల్లో 17 ఏకగ్రీవంగా కూటమికి  (టీడీపీ 15, జనసేన 1, బీజేపీ 1) దక్కాయి. మిగతా స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.