ఆంధ్రప్రదేశ్

రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు

కోస్తాంధ్రకు వర్షసూచన : వాతావరణ కేంద్రం

Aravind Reddy

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్​లోని కోస్తాంధ్రకు వర్ష సూచన. రాబోయే మూడు రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఉన్న కొమొరిన్ ప్రాంతం నుంచి దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటకపై ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ప్రభావిత జిల్లాలివే

ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు జల్లులు పడొచ్చు. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.