ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ) గ్రూప్–1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, గుంటూరు జిల్లాల్లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటించింది. విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ, గ్రూప్–1 జవాబు పత్రాల మూల్యాంకన బాధ్యతలు క్యామ్‌సైన్ మీడియాకు అప్పగించినట్లు గుర్తించింది. మూల్యాంకన ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ఆరోపించిన ఈడీ గుంటూరు చినకాకానిలోని హాయ్‌ల్యాండ్ రిసార్టుకు జవాబు పత్రాలను తరలించి, అక్కడే 84 రోజుల పాటు ఉంచినట్లు తేల్చింది. మూల్యాంకనం పేరిట చెల్లించిన రూ.1.14 కోట్లను నేర ఆదాయంగా నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి నిధుల మళ్లింపు, ఆస్తుల కొనుగోలు, వివిధ లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతున్నది.
2018లో 169 పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌కు 2020లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. జవాబు పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు బయటపడటంతో 2025 ఏప్రిల్ 25న విజయవాడ సూర్యారావుపేటలో కేసు నమోదైంది. అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, ఆయన మిత్రుడైన క్యామ్‌సైన్ మీడియా ప్రతినిధి పమిడికాల్వ మధుసూదన్ తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.