ప్రభాత ఉదయం, అమరావతి : అర్నబ్ తుఫాను ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాలను అతలాకుతలం చేసింది. రూ.4,600 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. గురువారం సైతం వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలు లేక జనజీవనం స్తంభించిపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదుల్లోకి భారీగా వరద నీరు రావడంతో వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిశాలో భారీ వర్షాల కారణంగా అక్కడి భగలట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం మండలంలో బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో చైన్నె–కోల్‌కతా హైవే పైకి భారీగా నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయియాయి. భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అధికారులు బాహుదా నదికి మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సోంపేట మండలం లక్కవరం పరిసరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రధాన రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. జిల్లాలోని నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు.
రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం
శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో గొట్టా బ్యారేజీ వద్ద వంశధార ఉద్ధతి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రైల్వే ట్రాక్‌లపై కూడా భారీగా నీరు చేరడంతో దక్షిణ తీర రైల్వే 57 రైళ్లను రద్దు చేసి, 15 రైళ్లను రీషెడ్యూల్ చేసింది. విశాఖ–భువనేశ్వర్ మార్గంలో సర్వీసులు నిలిచిపోయాయి. ఇచ్ఛాపురం–ఝడుపుడి మధ్య రైల్వే ట్రాక్‌లు, బ్రిడ్జిలు నీట మునిగి చెన్నై–హౌరా మార్గంలో రైలు సర్వీసులు రద్దయ్యాయి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి వరద చేరి బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. విశాఖ, విజయవాడ విమానాశ్రయాల్లో పలు విమానాలు రద్దయ్యాయి. కోనసీమలో 130 కి.మీ. వేగంతో గాలులు వీచడం వల్ల వేలాది కొబ్బరి చెట్లు, అదే స్థాయిలో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఉప్పాడ తీర రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. విజయనగరం జిల్లాలో గరివిడి, శృంగవరపుకోట, వేపాడ, చీపురుపల్లి వంటి ప్రాంతాల్లో 25–26 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో సహాయక చర్యలకుడెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. పాత్రపూర్‌లో 546 మి.మీ., సనఖేముండిలో 386 మి.మీ. వర్షం కురిసింది. దీంతో 2 వేల మందిని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గల్లంతయ్యి.. రెండ్రోజులుగా బిక్కుబిక్కుమంటూ..
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు మంగళవారం వేటకు వెళ్లగా సముద్రంలో బోటు తిరగబడింది. ఈదుకుంటూ వెళ్లినవారు హోప్ ఐలాండ్‌కు చేరి ప్రాణాలను కాపాడుకున్నారు. ఐలాండ్ పొదల్లో చిక్కుకున్న వారి సమాచారం అందుకున్న మత్స్యశాఖ, ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థలు రంగంలోకి దిగి 10 బోట్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురువారం వారిని గుర్తించి సురక్షితంగా తీరానికి చేర్చారు. తుఫాను తీవ్రత దృష్ట్యా వేటకు వెళ్లవద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ హెచ్చరికలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
బలహీనపడిన అర్నబ్
అర్నబ్ తుఫాను బలహీనపడి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్లకు రూ.1500 పరిహారం: సీఎం
తుఫాను కారణంగా ఏపీలో దాదాపు రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. మొదట ఏరియల్ వ్యూ ద్వారా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని చెయ్యేరు, వేట్లపాలెం, గచ్చకాయలపొర గ్రామాలను సందర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతన్నలకు ధైర్యం చెప్పారు. పునరావాసకేంద్రాల్లో ఉన్న బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడారు. అనంతరం ముమ్మిడివరం నియోజకవర్గం గచ్చకాయలపొరలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కేంద్ర బృందాలు శుక్రవారం రానున్నట్లు తెలిపారు. నష్టపోయిన ఒక్కో కొబ్బరిచెట్టుకు, ఆయిల్ పామ్ చెట్టుకు రూ.1,500 చొప్పున పునరావాస కేంద్రం నుంచి వెళ్లే వారికి 25 కేజీల బియ్యం, ఒక సరుకుల ప్యాకెట్టు, ఖర్చులకు డబ్బులు ఇస్తామని తెలిపారు. ‘‘కోనసీమలో 8 వేల కరెంట్ పోల్స్ పడిపోయాయి. వాటన్నింటినీ పునరుద్ధరించి వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా చేస్తాం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి 1000 మంది సిబ్బందిని పంపాలని కోరాం. అవసరమైతే కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా రప్పిస్తాం. పడిపోయిన పాకలను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాను”అని సీఎం పేర్కొన్నారు.
పారిశుధ్యం కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: డిప్యూటీ సీఎం
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రభావిత ప్రాంతాలకు 475 మందితో కూడిన ప్రత్యేక బృందాలను నియమించినట్లు వెల్లడించారు. యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక వాటర్ టెస్టింగ్ బృందాలను పంపాలని అధికారులను ఆదేశించారు.