అర్నబ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. 
ఆంధ్రప్రదేశ్

అర్నబ్‌ తుఫాను బీభత్సం.. 3.30 లక్షల హెక్టార్లలో పంట నష్టం!

అర్నబ్ తుఫానుతో ఏపీలో 3.30 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి : అర్నబ్‌ తుఫాను సృష్టించిన బీభత్సంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలోని అనేక గ్రామాలు అంధకారం నుంచి బయటపడలేదు. ఎటు చూసినా నీట మునిగిన పంట పొలాలు, నేలకొరిగిన కొబ్బరి చెట్లు, అరటి తోటలే దర్శనమిస్తున్నాయి. విద్యుత్‌ స్తంభాలు, తెగిపోయిన తీగలను విద్యుత్​ శాఖ సిబ్బంది సరిచేస్తున్నారు. విద్యుత్‌ సరఫరా లేక, తాగునీటి మోటర్లు పనిచేయక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో 5,400 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా 75 శాతానికిపైగా పనులు పూర్తి చేసి విద్యుత్‌ను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 700 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లాలో 835 గ్రామాల్లో సరఫరాను పునరుద్ధరించగా, మరో 80 గ్రామాల్లో మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.

3,30 లక్షల హెక్టార్లలో పంట నష్టం

తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా జిల్లాల్లో వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో తుఫాన్​ నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3.30 లక్షల హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 76,752 హెక్టార్లు, కాకినాడలో 52,253, తూర్పుగోదావరిలో 49,959, కోనసీమలో 46,845, కృష్ణా జిల్లాలో 44,836 హెక్టార్ల పంటలు ప్రభావితమైనట్లు గుర్తించారు. ఉద్యానవన రంగానికి కూడా తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అరటి చెట్లు విరిగిపోయాయి. కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. ఆయిల్‌పామ్‌ తోటలు దెబ్బతిన్నాయి. మామిడి, ఇతర పండ్ల తోటలకు కూడా నష్టం జరిగింది. సుమారు 22,452 హెక్టార్ల ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు, కోనసీమ, కృష్ణా తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక చోట్ల రోడ్లు ధ్వంసం కావడంతో ప్రజా రవాణా, నిత్యావసరాల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ: సీఎం చంద్రబాబు

తుఫాను బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. నరసాపురం మండలం కొత్త నవరసపురంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. పంటలు, కొబ్బరి తోటలు, విద్యుత్‌ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. రైతుల కష్టం వృథా కాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా కూడా నష్టాన్ని భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నరసాపురం ప్రాంతంలో కూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్ల తొలగింపు, పునరుద్ధరణ పనులను సీఎం పరిశీలించారు. మాట్రేవు గ్రామంలోని తుఫాను షెల్టర్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో వచ్చిన తుఫానులతో పోలిస్తే ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని, అయినప్పటికీ దురదృష్టవశాత్తూ ఏడుగురు మృతి చెందారని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. మత్స్యకారులు, కొబ్బరి రైతులకు కూడా న్యాయం చేస్తామన్నారు. 

 రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున జమ

పీఎం–కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల కింద రెండో విడత నిధులను శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం తెలిపారు. ఏడాదికి మూడు విడతల్లో మొత్తం రూ.20 వేలు అందిస్తామని హామీ ఇచ్చామని, అందులో భాగంగా రెండో ఏడాది రెండో విడతగా రూ.7 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.

 తుఫానులో చిక్కుకున్న నౌక.. 20 మంది సురక్షితం

తుఫాను కారణంగా బంగాళాఖాతంలో చిక్కుకున్న భారీ నౌకలోని 20 మంది సిబ్బందిని భారత తీర రక్షక దళం కాపాడింది. ఏపీ తీరానికి సమీపంలోని అంతర్వేది వద్ద సముద్రంలో నిలిచిపోయిన ఎంవీ సిగ్మా పెర్ల్‌ సరుకు రవాణా నౌక లోని వారందరినీ హెలికాప్టర్‌ సాయంతో ఒడ్డుకు తరలించారు. విశాఖపట్నంలో సరుకు దించి వెళుతుండగా బలమైన గాలులకు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో నియంత్రణ కోల్పోయింది. అంతర్వేది సమీపంలోని తక్కువ లోతు ఉన్న సముద్ర ప్రాంతంలో ఇసుకలో చిక్కుకుపోయింది. సమాచారమందుకున్న భారత తీర రక్షక దళం అప్రమత్తమైంది. చెన్నై నుంచి ‘సుజయ్‌’ అనే ఆఫ్‌షోర్‌ పెట్రోలింగ్‌ నౌకను తెప్పించి సిబ్బందిని తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్‌పురంలోని వైమానిక కేంద్రం నుంచి హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు ప్రారంభించారు. సముద్రంలో చిక్కుకున్న నౌకను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 రెండు రోజుల్లో అల్పపీడనం

అర్నబ్‌ తుఫాను నష్టం నుంచి తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్‌కు మరో అప్పపీడనం ముప్పు పొంచి ఉంది. అండమాన్‌ నికోబార్‌ దీవులపై కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు. రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఏపీ తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.