ప్రజాస్వామ్య వైచిత్రికి ఆ ఇద్దరి కథే ఒక మహోన్నత సాక్ష్యం! ఒకప్పుడు ఇద్దరూ ఆప్తమిత్రులు.. ఒకే సమయంలో ఒకే పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. 1978వ సంవత్సరం.. కొత్తగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టిన ఆ ఇద్దరు మిత్రులు ఒకే గదిని పంచుకున్నారు, రాజకీయ భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు, ఒకే మంత్రివర్గంలో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. వారే ఒకరు నారా చంద్రబాబు నాయుడు, మరొకరు వైఎస్ రాజశేఖర రెడ్డి! వారి స్నేహం ఎంత ఆత్మీయమైనదో, తర్వాతి రోజుల్లో వారి మధ్య సాగిన రాజకీయ సమరం కూడా అంతే చారిత్రాత్మకమైనది. కాలం వారిని వేర్వేరు జెండాల కింద నిలబెట్టినా.. మూడు పదుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ తీరాలను ఒకరికొకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ తీవ్రంగా ప్రభావితం చేశారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టి ఆ పార్టీకి తిరుగులేని నాయకుడిగా ఎదిగితే.. వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక రాజకీయ పునాది నిర్మించుకున్నారు. ఒకప్పుడు భుజం భుజం కలిపి నడిచిన ఈ ఇద్దరు నేతలు.. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా మారారు.
రెండు దారులు.. ఒకే లక్ష్యం
చంద్రబాబు నాయుడు 1978లో తొలిసారి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇద్దరూ ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య మంత్రివర్గంలో మంత్రులుగా ఒకే సమయంలో పని చేయడం విశేషం. చంద్రబాబు సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య తదితర శాఖలు నిర్వహించగా, వైఎస్ఆర్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.
1983లో ఇద్దరు మిత్రుల రాజకీయ దారులు స్పష్టంగా విడిపోయాయి. 1981లో నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్న చంద్రబాబు, అప్పటికే కాంగ్రెస్ యువనేతగా ఎదుగుతున్నారు. అయితే 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో చంద్రబాబు కాంగ్రెస్‌లోనే ఉండి “అవసరమైతే మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తాను” అని ప్రకటించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తరఫున చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 1983లో ఎన్నికల్లో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విజయాన్ని సాధించింది. తర్వాత తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. అలా ఒకప్పుడు మామకు రాజకీయంగా ఎదురుగా నిలిచిన చంద్రబాబు.. ఆ తర్వాత అదే మామ స్థాపించిన పార్టీకి కీలక నాయకుడిగా ఎదిగిన ఆసక్తికర రాజకీయ ప్రయాణం మొదలైంది.
36 ఏళ్లకే పీసీసీ పగ్గాలు
మరోవైపు వైఎస్ఆర్ 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం మధ్య కూడా పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985లో ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు కూడా వైఎస్సార్ పులివెందుల నుంచి మరోసారి గెలిచి తన నియోజకవర్గంలో తన బలాన్ని నిరూపించుకున్నారు. 1984లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలని, యువ నాయకులకు బాధ్యతలు ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే 1985లో కేవలం 36 ఏళ్ల వయసులోనే ఏపీసీసీ అధ్యక్ష పగ్గాలు వైఎస్ఆర్ కు అప్పగించారు. 1985 ముందస్తు ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నేతృత్వంలోనే ఎదుర్కొంది.
ప్రతిపక్షంలో వైఎస్ఆర్ పోరాటం.. టీడీపీలో చంద్రబాబు వ్యూహం
1985 ముందస్తు ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ నేతృత్వంలోనే ఎదుర్కొంది. వైఎస్సార్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, కరువు ప్రాంతాల్లో రైతు పోరాటాలు నిర్వహిస్తూ ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రాజీవ్-వైఎస్సార్ మధ్య ఏర్పడిన రాజకీయ సంబంధం, తర్వాతి కాలంలో వైఎస్ఆర్ కడప ఎంపీగా కేంద్ర రాజకీయాల్లోనూ, ఆపై రాష్ట్ర కాంగ్రెస్ తిరుగులేని మహానాయకుడిగా ఎదిగేందుకు బలమైన పునాదిగా మారింది. అదే సమయంలో చంద్రబాబు 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కరరావు కుట్రతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ, వారిని బెంగళూరు, దిల్లీలకు తరలించి రాష్ట్రపతి ముందు బలాన్ని నిరూపించడంలోనూ, మీడియా-ఇతర ప్రతిపక్షాల మద్దతు కూడగట్టడంలోనూ ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. 1984 సంక్షోభం తదనంతరం ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి 1985 మార్చిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకుండా అభ్యర్థుల ఎంపిక, ప్రచార ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమన్వయం చేయడం వంటి బాధ్యతలన్నీ చంద్రబాబు దగ్గరుండి చూసుకున్నారు. 1985 ఎన్నికలలో పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయంలో చంద్రబాబు నిర్వహించిన బాధ్యతలను గుర్తించి, ఎన్టీఆర్ ఆయనకు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ (ప్రధాన కార్యదర్శి) బాధ్యతలను అప్పగించారు.
1989లో.. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ
1989 ఎన్నికలు చంద్రబాబు–వైఎస్ఆర్ రాజకీయ ప్రయాణంలో మరో కీలక మలుపుగా నిలిచాయి. చంద్రబాబునాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందగా, వైఎస్ రాజశేఖరరెడ్డి కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1983, 1985లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్సార్ ఈసారి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మరోవైపు 1985లో అసెంబ్లీకి దూరంగా ఉండి టీడీపీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా పనిచేసిన చంద్రబాబు, 1989లో కుప్పం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇలా ఒకరు రాష్ట్ర అసెంబ్లీలోకి, మరొకరు పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడంతో ఇద్దరి రాజకీయ ప్రస్థానాలు కొత్త దశలోకి ప్రవేశించాయి. తర్వాతి కాలంలో చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో, వైఎస్సార్ జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తూ ఎదగడానికి 1989 ఎన్నికలు కీలక మెట్టుగా మారాయి.
1994లో ఆర్థిక మంత్రి..1995లో సీఎం
1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మరో కీలక దశలోకి ప్రవేశించింది. కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబుకు ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల బాధ్యతలు అప్పగించారు. అయితే 1995 ఆగస్ట్ సంక్షోభం తర్వాత 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, ఎన్టీఆర్ తర్వాత టీడీపీకి కొత్త నాయకత్వాన్ని అందించారు. అదే సమయంలో 1999 వరకు వైఎస్ఆర్ కడప ఎంపీగానే కొనసాగారు.
1999లో ఇద్దరి మిత్రుల మధ్య తొలి సమరం
1994లో దారుణంగా ఓడిపోయి తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించేందుకు 1998 చివర్లో ఏఐసీసీ నాయకత్వం వైఎస్ఆర్ను ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో 1999 ఎన్నికలలో ఆప్తమిత్రులైన చంద్రబాబు, వైఎస్ఆర్ మొదటిసారి నేరుగా ముఖాముఖి తలపడ్డారు. ఒకవైపు చంద్రబాబు తన 'విజన్ 2020', ఐటీ అభివృద్ధి నినాదం, కార్గిల్ యుద్ధ విజయం ప్రభావం, వాజ్‌పేయి ఈమేజ్ తో ఆ ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధించారు. మరోవైపు వైఎస్ఆర్ రైతు సమస్యలు, సంక్షేమం ఆధారంగా ప్రచారం చేసిన ఫలించ లేదు. 1999 ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానాలను, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచారు. 1999లో చంద్రబాబు విజయం సాధించినప్పటికీ ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ చూపిన పట్టుదలే ప్రతిపక్ష నేతగా ఆయనను నిలబెట్టి, 2003 నాటి 'ప్రజా ప్రస్థానం' పాదయాత్రకు, 2004లో కాంగ్రెస్ చారిత్రాత్మక విజయానికి బలమైన పునాదిగా మారింది.
చంద్రబాబు వర్సెస్ వైఎస్ఆర్.. అసెంబ్లీలో ఇద్దరి మిత్రుల హోరాహోరీ
1999 ఎన్నికల తర్వాత సీఎంగా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత (Leader of Opposition) వైఎస్ రాజశేఖర రెడ్డి శాసనసభ సాక్షిగా సాగించిన వాదోపవాదాలు రాష్ట్ర రాజకీయాన్ని అత్యంత ఉత్కంఠభరితంగా మార్చాయి. ఒకవైపు అభివృద్ధి, సంస్కరణలు, పరిపాలనా మార్పులను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, మరోవైపు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఎత్తిచూపే వారు. విద్యుత్ ఛార్జీలు, రైతుల సమస్యలు, ప్రభుత్వ సంస్కరణలు, సంక్షేమం, గ్రామీణ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై ఇద్దరి మధ్య అసెంబ్లీలో తరచూ తీవ్ర వాదోపవాదాలు జరిగేవి. చంద్రబాబు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ గణాంకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తే.. వైఎస్ఆర్ క్షేత్రస్థాయి సమస్యలు, రైతులు–పేదల ఇబ్బందులను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసేవారు. సభలో ఒకరి వాదనకు మరొకరు దీటుగా సమాధానం ఇవ్వడం, కీలక అంశాలపై మాటల యుద్ధం సాగడం అప్పటి రాజకీయాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
2004, 2009లలో వైఎస్ఆర్ పైచేయి
1999 ఎన్నికలలో చంద్రబాబునాయుడు విజయం సాధిస్తే..తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికలలో వరుసగా రెండు సార్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇద్దరు మిత్రుల సమరంలో వైఎస్ఆర్ పై చేయి సాధించారు. 2004లో వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ 185 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా, టీడీపీ 47 సీట్లకు పరిమితమైంది. టీఆర్ఎస్ 26, సీపీఎం 9, సీపీఐ 6, ఎంఐఎం 4, బీజేపీ 2 సీట్లు సాధించాయి. 2009లో కాంగ్రెస్ సీట్లు 156కు తగ్గినప్పటికీ, వైఎస్ఆర్ నాయకత్వంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ 92, టీఆర్ఎస్ 10, ఎంఐఎం 7, సీపీఐ 4, బీజేపీ 2, సీపీఎం 1 సీట్లు గెలుచుకున్నాయి.
2004 శాసనభ.. మరోసారి చంద్రబాబు వర్సెస్ వైఎస్ఆర్
2004 అసెంబ్లీలో ఒక అపూర్వమైన దృశ్యం ఆవిష్కృతమైంది. గతంలో ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్.. ముఖ్యమంత్రిగా ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్నారు. మరోవైపు తొమ్మిదేళ్లు వరుసగా ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాయుడు.. మొదటిసారి ప్రతిపక్ష నాయకుడి (Leader of Opposition) కుర్చీలో ఆసీనులయ్యారు. ఆ విధంగా మరోసారి వైఎస్ఆర్ వర్సెస్ చంద్రబాబు హోరాహోరీ కొనసాగింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్సార్ ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాలతో ప్రజా రాజ్య స్థాపనే తమ లక్ష్యమని ప్రకటించగా.. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాల ఆర్థిక భారం, విద్యుత్ రంగానికి జరిగే నష్టాలపై లెక్కలతో వైఎస్ఆర్ విధానాలను తీవ్రంగా సవాలు చేశారు. 'జలయజ్ఞం' ప్రాజెక్టులు, మద్యం పాలసీ, శాంతిభద్రతలపై చంద్రబాబు సభను శాసించే రీతిలో నిలదీస్తే, వైఎస్ఆర్ తనదైన శైలి చిరునవ్వుతో "మా పాలన ప్రజల కోసం.. మీ పాలన కార్పొరేట్ల కోసం" అంటూ ఘాటుగా ఎదురుదాడి చేసేవారు. ఆ విధంగా 1999లో సీఎం చంద్రబాబు - ప్రతిపక్ష నేత వైఎస్సార్‌గా సాగిన మిత్రపోరు, 2004లో బాధ్యతలు మారి సీఎం వైఎస్ఆర్ - ప్రతిపక్ష నేత చంద్రబాబుగా రూపాంతరం చెంది ఉమ్మడి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మరో చారిత్రాత్మక అధ్యాయంగా నిలిచింది.
అప్పుడు తండ్రి..ఇప్పుడు కొడుకు..అరుదైన పోరు
2009 సెప్టెంబర్ 2న పావురాల గుట్ట వద్ద జరిగిన విషాదకర హెలికాప్టర్ ప్రమాదంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. కానీ వారి మధ్య సాగిన రాజకీయ ప్రత్యర్థిత్వం అక్కడితో ముగియలేదు.. వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షనేతగా చంద్రబాబుతో తలపడ్డారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఒకప్పుడు వైఎస్ఆర్ తో తలపడిన చంద్రబాబుకు.. తర్వాత ఆయన కుమారుడు జగన్‌తో ప్రతిపక్షనేతగా రాజకీయ సమరం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఒక తరం క్రితం చంద్రబాబు వర్సెస్ వైఎస్ఆర్గా సాగిన రాజకీయ పోరు.. తర్వాతి తరంలో చంద్రబాబు వర్సెస్ వైఎస్ఆర్ కుమారుడు జగన్‌గా మారడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక ఆసక్తికరమైన, అరుదైన చారిత్రక పరిణామంగా నిలిచింది.
తరాలు మారినా.. ముగియని సమరం!
ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థిత్వం నాయకులతోనే ముగిసిపోదు.. కొన్ని సందర్భాల్లో అది తరాలను దాటి కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు–వైఎస్సార్ కుటుంబం మధ్య సాగుతున్న రాజకీయ పోరు అందుకు అరుదైన ఉదాహరణ. 1978లో ఒకే సమయంలో ఎమ్మెల్యేలుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత ఒకే మంత్రివర్గంలో పనిచేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి.. కాలక్రమంలో రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. 2009లో వైఎస్సార్ మరణంతో ఆ రాజకీయ అధ్యాయం ముగిసినట్టనిపించినా.. 2014 తర్వాత అదే పోరు మరో రూపంలో కొనసాగింది. వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ రంగంలోకి వచ్చి చంద్రబాబుకు ప్రత్యర్థిగా నిలవడంతో.. తండ్రితో సాగిన సమరం కొడుకుతోనూ కొనసాగుతూ వస్తోంది. ఒక తరం మిత్రులుగా మొదలైన పరిచయం.. ప్రత్యర్థులుగా మారి, మరో తరంలో తండ్రి స్థానాన్ని కొడుకు భర్తీ చేయడం.. మళ్లీ అదే నాయకుడితో రాజకీయ సమరం కొనసాగడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అరుదైన పరిణామం. నాయకులు మారినా.. ఎన్నికలు మారినా.. ఈ రెండు రాజకీయ శక్తుల మధ్య పోరు మాత్రం రాష్ట్ర రాజకీయాల గమనాన్ని ప్రభావితం చేస్తూనే ఉండటం విశేషం.