ప్రభాత ఉదయం, అమరావతి : ‘‘ఒకవైపు ఎల్‌నినో కరవు, మరోవైపు వరుసగా ‘అర్నబ్’, ‘మురసు’ తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఒకేసారి ఇన్ని విపత్తులను ఎదుర్కోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ తుఫాన్ల వల్ల రూ.4,526 కోట్ల మేర ప్రాథమిక నష్టం వాటిల్లినట్లు అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపినట్లు చెప్పారు. నష్టాలను పరిశీలించేందుకు ఇప్పటికే కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయన్నారు.
వరుస తుఫాన్లు వచ్చినా రాష్ట్రంలో ఇంకా 28 శాతం, ముఖ్యంగా రాయలసీమలో లోటు వర్షపాతం కొనసాగుతోందని సీఎం వివరించారు. అయితే, వచ్చిన వరద నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లలో 11 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో 25 టీఎంసీలు నిల్వ చేశామని చెప్పారు. ఈదురు గాలులను తట్టుకునే విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పంటల సీజన్ మార్పు లేదా విపత్తులను తట్టుకునే వంగడాల సాగుపై ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని చెప్పారు. రైతులందరితో పంటల బీమా చేయించామన్నారు. గతంలో కరవు నిర్వహణపై రిటైర్డ్ ఐఏఎస్ ఏవీఎస్ రెడ్డితోనూ, హుద్‌హుద్ తుఫాను అనుభవం ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ టక్కర్‌తో విపత్తు నిర్వహణ మాన్యువల్స్ తయారు చేయించామని గుర్తుచేశారు.
దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు సిబ్బందిని పంపాలని తమిళనాడు, కర్ణాటక సీఎంలతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరానని చంద్రబాబు చెప్పారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారన్నారు. క్షేత్రస్థాయిలో కృషిచేసిన అధికారులను ఆయన ప్రశంసించారు.