సీఎం చంద్రబాబు 
ఆంధ్రప్రదేశ్

కొబ్బరి రైతులకు ఎకరాకు రూ.54 వేలు.. అరటి రైతులకు హెక్టారుకు రూ.35 వేల సాయం: చంద్రబాబు

అర్నబ్‌ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి బయటపడేందుకు చేపడుతున్న పునరుద్ధరణ పనులపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి : మరో తుఫాను పొంచి ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అర్నబ్‌ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి బయటపడేందుకు చేపడుతున్న పునరుద్ధరణ పనులపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో 1,293 ఎకరాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయని, ఎకరాకు రూ.54 వేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు. అలాగే 15 వేల హెక్టార్లలో దెబ్బతిన్న అరటి పంటకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడినా మొబైల్‌ నెట్‌వర్క్‌ పనిచేసేలా అన్ని మండల కేంద్రాల్లో డీజిల్‌ జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రానున్న తుఫాను గురించి చర్చించారు. ఉపగ్రహ చిత్రాలు, డాప్లర్‌ రాడార్ల ద్వారా ప్రతి ఆరు గంటలకు ఓసారి వాయుగుండం గమనాన్ని అంచనా వేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

పెను విపత్తు.. పెద్ద మనసుతో ఆదుకోండి

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్‌ దాస్‌ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం శనివారం ఏపీకి వచ్చింది. సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కేంద్రాన్ని సభ్యులు సందర్శించారు. అర్నబ్​ తుఫాన్‌ చేసిన నష్టం, తాము చేపట్టిన ముందస్తు చర్యల చర్యల గురించి ఆర్టీజీఎస్​ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఆర్టీజీఎస్‌ సీఈఓ ప్రఖర్‌ జైన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ‘‘తుఫానుకు ఆరు రోజుల ముందు నుంచే ప్రజలను అప్రమత్తం చేస్తూ 7.23 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులకు నిరంతరం హెచ్చరికలు జారీ చేశాం. సహాయ చర్యలకు జిల్లా, మండల స్థాయిలో 3,455 కంట్రోల్​ రూములు ఏర్పాటు చేశాం.  3,918 నోడల్‌ అధికారులను నియమించాం. 20 జిల్లాల్లో 2,199 షెల్టర్లను ఏర్పాటు చేసి 34,716 మందిని తరలించాం. మనమిత్ర వాట్సాప్​ ద్వారా వచ్చిన తుఫాన్‌ సంబంధిత సమస్యల్లో 95 శాతానికిపైగా పరిష్కరించగలిగాం’’ అని తెలియజేశారు. ‘‘3.52 లక్షల హెక్టార్లలో పంటలు, 23,383 హెక్టార్లలో ఉద్యానవన పంటలు,  2,491 కిలోమీటర్ల మేర రాష్ట్ర ప్రధాన రహదార్లు, 7,382 ఇళ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్​ రంగానికి భారీ నష్టం వాటిల్లింది” అని చెప్పారు. రాష్ట్రంలో రూ.4,764 కోట్ల మేర నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కేంద్ర బృందానికి తెలిపారు. విపత్తుల వేళ మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా చేపట్టిన చర్యలపై బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించేలా సిఫారసు చేయాలని కేంద్రానికి నివేదిస్తామని వెల్లడించారు.

ఎస్‌బీఐ రూ.5 కోట్ల విరాళం

తుఫాన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు సాయమందించేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందుకొచ్చింది. సీఎం సహాయ నిధికి రూ.5.1 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ మేరకు ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమర రామ్మోహన్‌ రావు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసి చెక్కు అందజేశారు. తుఫాన్‌ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఎస్‌బీఐ మేనేజ్‌మెంట్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.