మురసు తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు, ఈదురుగాలులు 
ఆంధ్రప్రదేశ్

ఏపీలో మురసు బీభత్సం

మురసు తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వేలాది చెట్లు నేలకూలగా, పంటలు దెబ్బతిన్నాయి.

Phaneendra

అమరావతి : మురసు తుఫాను ఏపీలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. మంగళవారం కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి వేలాది చెట్లు నేలకూలగా, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. తీర ప్రాంతాల్లో మత్స్యకారుల పడవలు ధ్వంసమవడంతో వారికి భారీ నష్టం వాటిల్లింది. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తుఫాను తీరం దాటింది. ఈ క్రమంలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ముందస్తు చర్యల్లో భాగంగా వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

 అతలాకుతలం

అర్నబ్, మురుసు తుఫాన్ల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో 30,661 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. 4,095 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. పలు గ్రామాల్లో 613 జనరేటర్లు ఏర్పాటు చేశారు. కోస్తాతోపాటు కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కరుస్తున్నాయి. సోమవారం రాత్రి 10 గంటలకు వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లా ఎన్జీపాడులో 114.19 మి.మీ., బాపట్ల జిల్లా చీరాలలో 99.59 మి.మీ, ప్రకాశం జిల్లా త్రోవగుంటలో 91.95 మి.మీ, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 79.34 మి.మీ, డా. బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మల్కీపురంలో 74.75 మి.మీ. వర్షపాతం నమోదైంది.

 రాకపోకలు బంద్

తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదల గ్రామానికి వెళ్లే దారిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా బీలుగుమిల్లి–బర్రింకలపాడు మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుంటూరు జిల్లా తాడికొండలో పత్తి, వరి పంటలు పూర్తిగా నీట మునిగాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట కౌంటింగ్‌ కేంద్రంలోకి భారీగా వరదనీరు చేరడంతో కౌంటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. బాపట్ల జిల్లా చుండూరులో విద్యుత్‌ వైర్ల మీద భారీవృక్షం పడిపోవడంతో సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.

 నాలుగు రోజులూ వర్షాలే

మురసు తుఫాను కారణంగా ఏపీతోపాటు తమిళనాడు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ సమయంలో గంటకు 120 కిలో మీటర్ల భారీ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలెర్టైన ఏపీ, ఒడిశా అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తమిళనాడులో స్కూళ్లను మూసివేశారు. చెన్నై ఎయిర్‌పోర్టులో 11, విజయవాడ విమానాశ్రయంలో 19 విమానాలను రద్దు చేశారు.