ఆంధ్రప్రదేశ్

వర్షపు నీటితో జలాశయాలు నింపాలి : ఏపీ సీఎం చంద్రబాబు

మురసు తుఫాన్‌ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 50 టీఎంసీల వరద నీటిని వినియోగించుకోవాలని, చెరువులు, రిజర్వాయర్లను నింపాలని ఆదేశించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి : అర్నబ్‌ తుఫాన్‌తో పోలిస్తే మురసు తుఫాన్‌ తీవ్రత తక్కువగా ఉంటుందని అంచనాలు ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి ఆయన సోమవారం ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 50 టీఎంసీలదాకా వరద వస్తుందన్న అంచనాల మేరకు వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకుని చెరువులు, రిజర్వాయర్‌లను నింపాలని సూచించారు. లోటు వర్షపాతం నమోదైన గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాల్లో జలాశయాలను నింపాలన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ బేసిన్‌లోని రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకునేలా కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు అదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే చాలావరకు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అర్నబ్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేలా శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ముందుగానే ఏర్పాట్లు చేశామని, మురసు తుఫాన్‌ ప్రభావాన్ని కూడా సమర్థంగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. మురసు తుఫాను గాలుల ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని సుమారు 8 వేల విద్యుత్‌ స్తంభాలపై పడే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ విద్యుత్‌ పునరుద్ధరణ కోసం చెన్నై నుంచి మరో వెయ్యి మంది సిబ్బంది వస్తున్నారని, వారిని నెల్లూరు, ప్రకాశంసహా వివిధ జిల్లాల్లో వినియోగించాలని సూచించారు. మురసు ప్రభావంతో పల్నాడు జిల్లాలో 30 సెంటీమీటర్లు, ప్రకాశంలో 24, మార్కాపురంలో 19, కష్ణా, గుంటూరు జిల్లాల్లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కావొచ్చని అధికారులు తెలిపారు. ఏలూరులో 9 సెం.మీ., నెల్లూరులో 9 సెం.మీ. మేర వర్షాలు పడొచ్చని చెప్పారు.