ప్రభాత ఉదయం, అమరావతి : మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రూ. 1,918 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈమేరకు క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు గురువారం మురసు తుఫాను నష్టాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల వారీగా జరిగిన నష్టాన్ని, చేపట్టిన సహాయక చర్యల వివరాలు సీఎం తెలుసుకున్నారు. వరుసగా రెండు తుపాన్లు రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
పునరుద్ధరణ చర్యలు
తుపాను కారణంగా బాపట్ల జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 2, పల్నాడు జిల్లాలో ఒకరు, మొత్తం 8 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో 983 ఇళ్లు, 346 బోట్లు, 220 వలలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌కు సంబంధించి 1103 ప్రభావిత 11 కేవీ ఫీడర్లలో 871 పునరుద్ధరించినట్టు సీఎంకు తెలిపారు. మరో 232 పునరుద్ధరించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. రోడ్లు భవనాల శాఖ పరిధిలో రాష్ట్ర, జిల్లా రహదారులు 760.10 కిలోమీటర్ల వరకు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పరిధిలో 74 గ్రామీణ రహదారులు దెబ్బతినగా, 204.14 కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. మురసు తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక త్వరితగతిన రూపొందించి కేంద్రానికి సమర్పించాలని సీఎం ఆదేశించారు.