ప్రభాత ఉదయం, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ను ‘మురసు’ తుఫాను వెంటాడుతోంది. రెండు రోజులుగా కోస్తా, మధ్య ఆంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటిన ప్రకాశం, బాపట్ల జిల్లాలపై భారీ ప్రభావం పడింది. ఒంగోలు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, చినగంజాం, కారంచేడు వంటి ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది. మొత్తం 15 జిల్లాలపై ప్రభావం చూపిన తుఫాను 132 మండలాల్లో 52,459 హెక్టార్లలో పంటలను నాశనం చేసింది. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థమైంది. 2,750 స్తంభాలు కూలిపోగా, 312 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇద్దరు మృతి చెందారు. 12,230 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
పొన్నూరు, గుంటూరులో 300 మి.మీ. వర్షం
భారీ వర్షాలతో గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొన్నూరు, గుంటూరు నగరంలో 300 మి.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం వంటి ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కట్టలేరు వాగు పొంగి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుడమేరు, మున్నేరు, కీసర వాగులు కూడా పెరిగి ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోని వాగుల నుంచి భారీ వరద చేరడంతో ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులకు పెరిగింది. అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 71 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తుఫాన్ల ప్రభావంపై ప్రధాని ఆరా
సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఫోన్ చేశారు. వారం వ్యవధిలో రాష్ట్రంలో అర్నబ్, మురసు తుఫాన్లు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుఫానుల ప్రభావం, ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ప్రధానికి సీఎం వివరించారు. ఈదురుగాలులు, వరదల కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. రహదారులు, విద్యుత్ సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం సాయమందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. నిరంతర అప్రమత్తతతో తుఫాన్ వల్ల కలిగిన ఇబ్బందులను సమర్థంవంతంగా అధిగమించారంటూ సీఎంను ప్రధాని ప్రశంసించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు చంద్రబాబు బుధవారం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ నిర్వహించారు. అనంతరం అధికారులతో సమావేశమై ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచించారు.
ఉపాధి కూలీ పనిదినాలు 200 రోజులకు పెంచాలి
రాష్ట్రంలో భారీ వర్షాలతో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని, ప్రజల కష్టాలను తీర్చేలా కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల అంచనా కోసం ఈనెల 2, 3వ తేదీల్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) బుధవారం ముఖ్యమంత్రిని కలిసింది. అధ్యయన వివరాలను సీఎంకు తెలియజేశారు. ఓవైపు తీర ప్రాంతం తుఫాన్లతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో కారణంగా రాయలసీమ సహా మరికొన్ని ప్రాంతాలు కరవుతో అల్లాడుతున్నాయని బృందానికి సీఎం వివరించారు. అనంతపురం జిల్లాలో దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం నమోదైందన్నారు. వీబీజీరామ్ జీ పథకం కనీస పనిదినాలను 200 రోజులకు పెంచి, వ్యవసాయ రంగ పనులకు ఈ పథకాన్ని వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బృందం వెల్లడించింది.