కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖలో సీఐఐ రీజనల్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్
4,249 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖపట్నం: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక భారీగా పెట్టుబడులు వస్తున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ముందున్నదని చెప్పారు. ఈ విధానం వల్లే పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగిందన్నారు. బుధవారం విశాఖ ఐఐఎంలో నిర్వహించిన సీఐఐ రీజినల్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కూటమి ప్రభుత్వం వినూత్న ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పుకొచ్చారు. మౌలిక సదుపాయాలు పెంచి పెట్టుబడులను ఆకర్షించి.. ఉపాధి అవకాశాలు పెంచాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.
30 ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఈ సదస్సు ద్వారా రూ. 4,249 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 23,256 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 30 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.