ఆంధ్రప్రదేశ్

అధికారుల చేతుల్లోకి టీటీడీ నిర్వహణ.. ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీ

టీటీడీ పాలకమండలి పదవీ కాలం ముగియడంతో ముగ్గురు సభ్యులతో ప్రత్యేక అధికారుల కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీకి ఈవో ముద్దాడ రవిచంద్ర చైర్మన్‌గా ఉంటారు.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పదవీకాలం ముగిసింది. కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే వరకు దేవస్థానం పరిపాలనా బాధ్యతలను అధికారులే నిర్వహించనున్నారు. ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక అధికారుల కమిటీని సోమవారం నియమించింది. కమిటీ చైర్మన్​గా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, సభ్యులుగా ఆర్థిక శాఖ కార్యదర్శి వీ వినయ్‌ చంద్‌, రెవెన్యూ (ఎండోమెంట్స్‌) ప్రత్యేక కార్యదర్శి కే కన్నబాబు నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ టీటీడీ పాలకమండలికి ఉండే అన్ని అధికారాలను వినియోగించడంతోపాటు, బోర్డు నిర్వహించాల్సిన విధులన్నింటినీ చేపట్టనుంది. ఏడాది పాటు లేదా నూతన పాలకమండలి ఏర్పాటయ్యే వరకు కొనసాగుతుంది. ఇప్పటివరకు టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు కొనసాగగా.. ఆయన పదవీ కాలం ముగిసింది.