ప్రభాత ఉదయం, అమరావతి: వైద్య రంగంలో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు పరిష్కారాలు కనుగొనేందుకు వైద్య విద్యార్థులు కృషి చేయాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం ఏపీలోని విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, “వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా దేశంలో వైద్య విద్య విస్తరణ జరుగుతోంది. గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలతోపాటు ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల సంఖ్య పెరిగింది. 21 వేలు ఉన్న ఎంబీబీఎస్ సీట్లు, ప్రస్తుతం 1.20లక్షలకు పెరిగాయి. వైద్య విద్య కేవలం పట్టాలు పొందడానికి, వైద్య వృత్తిలో స్థిరపడటానికి మాత్రమే పరిమితం కాకూడదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి, వాటికి శాస్త్రీయ పరిశోధనల ద్వారా పరిష్కారాలు చూపే దిశగా విద్యార్థులు ముందుకు సాగాలి. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నుంచి భవిష్యత్తులో నోబెల్ బహుమతి గ్రహీతలు రావాలన్నది నా ఆకాంక్ష. విశ్వవిద్యాలయ స్థాపన వెనుక మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దూరదృష్టి ఎంతో ఉంది” అని వివరించారు.
స్మారక సంచిక విడుదల
విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని గుర్తుచేసే స్మారక సంచికను ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. వైద్య విద్య, పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో విశ్వవిద్యాలయం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, జాతీయ వైద్య కమిషన్ మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ ఎంకే రమేశ్ తదితరులు పాల్గొన్నారు.