ప్రభాత ఉదయం, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇరువర్గాలు రాళ్లు, సోడా బాటిళ్లు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రాష్ట్రంలో 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. 31,460 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దక్షిణ కోస్తా, సీమలో హింసాత్మక ఘటనలు
తిరుపతి, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లి గ్రామంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు పెట్రోల్ బాంబులు, రాళ్లు, సోడా బాటిళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ మాట్లాడుతూ ‘ఇరు పార్టీల కార్యకర్తలు విజయోత్సవాల కోసం తెచ్చుకున్న బాణాసంచా, బైక్‌ల నుంచి తీసిన పెట్రోల్‌తో దాడులు చేసుకున్నారు. పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాం’ అని చెప్పారు. అదే మండలం ఆర్.తుమ్మలపల్లి, పర్నపల్లి గ్రామాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. జమ్మలమడుగు నియోజకవర్గం గుండ్లకుంట, రాజంపేట డివిజన్ నందలూరు, చింతరాజుపల్లి, రైల్వే కోడూరు, బద్వేల్ ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తర్వాతే ఈ ఘటనలు జరిగాయని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తల్లూరు, చీమకుర్తి, తంగుటూరు మండలాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తల్లూరు మండలం కొర్రపాటివారిపాలెం, శివరామపురం గ్రామాల్లో తమ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి రానివ్వకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నట్లు వైసీపీ నాయకులు ఆరోపించారు. మాధవరంలో తమ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేసి ఓటర్లను బెదిరించారని తెలిపారు. చీమకుర్తి మండలం గోనుగుంటలో వైసీపీ ఏజెంట్లను ముందు రోజు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడంతో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించి నిరసన తెలిపారు. తంగుటూరు మండలం కోనిజేడులో ఒంగోలు నుంచి 150 మంది బౌన్సర్‌లను తీసుకొచ్చి వైసీపీ అనుచరులను అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించబోయిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పెట్రోల్ బాంబు దాడి జరిగినట్లు సమాచారం. చంద్రగిరి, చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూడా ఘర్షణలు, బెదిరింపులు ఘటనలు జరిగాయి. కడప జిల్లా లింగాల మండలం కర్ణపాపయ్యపల్లిలో బయటి నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఓటర్లను అడ్డుకున్నారని, పులివెందుల వేముల జడ్పీ హైస్కూల్‌లో వైసీపీ ఏజెంట్లను బూత్‌లోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని పేర్కొంది. అరసవల్లిలో పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సును ధ్వంసం చేశారు. ఇదే జిల్లా బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే లమిలినేని సురేందర్, ఆయన కుమారుడు యశ్వంత్‌పై ప్రత్యర్థి పార్టీ శ్రేణులు దాడికి ప్రయత్నించారు. స్వల్ప గాయాలు కావడంతో యశ్వంత్, ఎమ్మెల్యే గన్‌మెన్‌ను హాస్పిటల్‌కు తరలించారు.
వాగులు, వంకలు దాటి ఓటేశారు
తుఫాన్ కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురంమన్యం జిల్లా, కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. అయినప్పటికీ వాటిని దాటి ఆదివాసీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 68 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సి ఓట్ల లెక్కింపు 7న జరగనుంది. ఎన్నికల బందోబస్త్ కోసం 40వేల మంది సిబ్బందిని మోహరించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి
అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంటలో ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ అధికారి హరితగౌడ్ గుండెపోటుతో చనిపోయారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని ప్రయోజనాలు జాప్యం లేకుండా త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.