మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు గెలిచి ఓడారు.. మేం ఓడి గెలిచాం : వైఎస్ జగన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధికారికంగా గెలిచినా, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వైఎస్సార్‌సీపీ నైతికంగా విజయం సాధించిందని జగన్ అన్నారు.

Phaneendra

ప్రభాత ఉదయం, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ఓడారని, తాము ఓడి గెలిచామని మాజీ సీఎం, వైఎస్​ఆర్​సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినట్లు కనిపించినా, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వైఎస్​ఆర్​సీపీయే నైతికంగా గెలిచిందన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్​ఆర్​సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను అడ్డుకోవడం, దాడులు చేయడం, రిగ్గింగ్​కు పాల్పడటం, ఓటర్లను భయపెట్టడం వంటి చర్యలతో ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారని జగన్​ మండిపడ్డారు. ప్రజల ఓటు హక్కును, అభ్యర్థుల పోటీ హక్కును అడ్డుకునేలా అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు ఉపయోగించారని ఆయన ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్​ను సేఫ్‌ ఆంధ్ర నుంచి సేవ్‌ ఆంధ్ర  పరిస్థితికి తీసుకెళ్లారని మండిపడ్డారు.

కాళ్లు, చేతులు కట్టేసి పోటీలోకి దింపారు

‘‘ఏదైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో 40, 60, 80 వార్డులుంటే అన్ని వార్డుల్లోనూ పోటీ జరగాలి. కానీ పులివెందులలో 40 వార్డులుంటే 20 వార్డులకే నామినేషన్లు వేయగలిగే పరిస్థితిని సృష్టించారు. అంటే కాళ్లు, చేతులు కట్టేసి పోటీలోకి దింపినట్టే” అని జగన్​ వ్యాఖ్యానించారు.  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తంతు కొనసాగిందని ఆరోపించారు. 84 జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్​ఆర్​సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా దాడులు చేసి, వేసిన చోట్ల స్క్రూటినీ పేరుతో తిరస్కరించారని చెప్పారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో తమ పార్టీ ఏజెంట్లను సీఐ పోలీస్‌ స్టేషన్‌లోనే బంధించారన్నారు. అదే నియోజకవర్గంలోని మురట్లలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేస్తుంటే సీఐ రాజు కాపలా కాశాడని వైఎస్​ జగన్​ పేర్కొన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లిలో పోలీసుల సమక్షంలోనే పెట్రోల్‌ బాంబులతో వైఎస్​ఆర్​సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. ఈ దాడిని అడ్డుకున్న వారినే పోలీసులు అరెస్టు చేశారని ఆయన ఫైర్​ అయ్యారు.