Elon Musk says Tesla and SpaceX are weighing a $3.5 trillion merger 
బిజినెస్

చరిత్రలోనే అతిపెద్ద డీల్.. మస్క్​ మరో సంచలనం​!

స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీల మధ్య రూ.331.58 లక్షల కోట్ల ($3.5 ట్రిలియన్ డాలర్లు) విలువైన చారిత్రాత్మక విలీన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు.

Haji Pasha

న్యూయార్క్​: ‘‘చరిత్రలోనే అతిపెద్ద కార్పొరేట్ విలీనం” అంటూ స్పేస్‌ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ తాజాగా చేసిన ఓ ప్రకటన సంచలనం సృష్టించింది. స్పేస్‌ ఎక్స్, టెస్లా కంపెనీలను కలిపి రూ.331.58 లక్షల కోట్లు (3.5 ట్రిలియన్​ డాలర్లు) విలువైన భారీ కార్పొరేట్ విలీనంగా మార్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ విలీన చర్చల్లో భాగంగా ఉన్న  ఉన్నతాధికారులను ఈ వ్యాఖ్యలు ఆందోళనలోకి నెట్టేశాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల నుంచి తమకు అనేక ప్రశ్నలు ఎదురవుతాయని, విలీన ప్రక్రియ ఇంకా ఆలస్యమయ్యే ముప్పు ఉంటుందని చర్చలతో నేరుగా సంబంధమున్న ఓ వ్యక్తి వెల్లడించారు.

మస్క్​ చేతిలో వాటాలు

స్పేస్‌ఎక్స్ కంపెనీయే టెస్లాను ఈ విలీనం కోసం సంప్రదించింది. విలీనంపై అధ్యయనం చేయడానికి ఇరు కంపెనీలు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశాయి.రెండు కంపెనీలను కలిపి ఒకే కొత్త మాతృసంస్థ కిందకు తీసుకురావాలా? లేదా టెస్లాను స్పేస్‌ఎక్స్ పూర్తిగా కొనాలా ? అనే కోణాల్లో ఆర్థిక సలహాదారులతో చర్చలు జరుపుతున్నారు. ఎలాన్​ మస్క్​కు టెస్లాలో 20 శాతం, స్పేస్​ ఎక్స్​లో 48 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలకూ ఆయనే సీఈఓ. చట్టప్రకారం ఇలాంటి రెండు కంపెనీల విలీన లావాదేవీల్లో స్వతంత్ర డైరెక్టర్లు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. మస్క్‌కు రెండు కంపెనీల్లోనూ వాటాలు ఉన్నందున, ఆయన ఈ చర్చల్లో పాల్గొనలేరు.

అటు చైనాలో.. ఇటు అమెరికాలో

ఈనేపథ్యంలో ఇరు కంపెనీల విలీనంపై మస్క్​ చేసిన తాజా వ్యాఖ్యలతో టెస్లా ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ విలీనం జరిగితే ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీ బిజినెస్ డీల్ అవుతుంది. అయితే దీనికి అంతర్జాతీయ నియంత్రణ సంస్థల నుంచి గట్టి నిఘా ఎదురవుతుంది. ఎందుకంటే టెస్లాకు చైనాలో భారీ వ్యాపారం ఉంది. మరోవైపు స్పేస్‌ఎక్స్ అమెరికా రక్షణ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై పనిచేస్తోంది. దీనివల్ల విలీన ప్రక్రియకు భద్రతా పరమైన అనుమతులు రావడం అంత సులువు కాదని పరిశీలకులు అంటున్నారు.