న్యూఢిల్లీ: ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో గురువారం బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. గత సెషన్‌లో గణనీయంగా పెరిగిన షేర్లు తాజాగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు 7.71 శాతం క్షీణించి రూ.83.47 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో 8.72 శాతం పడిపోయి రూ.82.55 కనిష్ఠ స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో షేరు 7.67 శాతం తగ్గి రూ.83.45 వద్ద స్థిరపడింది. దీంతో బ్యాంక్ మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.7,494.43 కోట్లు తగ్గి రూ.89,750.30 కోట్లకు చేరింది. బుధవారం మాత్రం ఈ షేరు 9 శాతం వరకు పెరిగి, బ్యాంక్ మార్కెట్ విలువకు రూ.8,086 కోట్లు జోడించింది.
రూ.53,000 కోట్లతో 60.72 శాతం వాటా
కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను సుమారు రూ.53,000 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ లావాదేవీ పూర్తయితే, భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఇదే అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా నిలిచే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం వాటాను సుమారు రూ.26,620 కోట్లకు, ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీకి చెందిన 30.24 శాతం వాటాను సుమారు రూ.26,440 కోట్లకు కొనుగోలు చేయడానికి ఫెయిర్‌ఫాక్స్ అనుబంధ సంస్థ కెనడా ఐఎన్‌సీను వ్యూహాత్మక కొనుగోలుదారుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది.
ఒక్కో షేరుకు రూ.81 ధర
ఈ ఒప్పందంలో భాగంగా ఫెయిర్‌ఫాక్స్ ఒక్కో షేరుకు రూ.81 చెల్లించనున్నది. రెండు స్వతంత్ర మదింపు సంస్థలు నిర్ణయించిన ఒక్కో షేరు రూ.75.99 సరసమైన విలువ కంటే ఈ ధర ఎక్కువగా ఉంది.
2022లో ప్రారంభమైన విక్రయ ప్రక్రియ
ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయ ప్రక్రియ 2022లో ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ప్రాథమిక బిడ్లు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర కంటే తక్కువగా ఉండటంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. తాజాగా ఫెయిర్‌ఫాక్స్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఈ లావాదేవీ ముందడుగు వేసింది.
నియంత్రణ సంస్థల ఆమోదం తప్పనిసరి
కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించినప్పటికీ, వాటాల విక్రయం పూర్తికావడానికి మరికొన్ని అనుమతులు అవసరం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొనుగోలుదారుకు సంబంధించిన అర్హతలు, విశ్వసనీయతను పరిశీలించే ‘ఫిట్ అండ్ ప్రాపర్’ మదింపు నిర్వహించనున్నది. దీనితోపాటు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఇతర చట్టబద్ధ సంస్థల అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతులన్నీ లభించిన తర్వాతే లావాదేవీ పూర్తికానున్నది. భారత బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులు, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ ఆస్తుల ప్రైవేటీకరణ దిశగా ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.