విదేశీ ఏఐ రంగ పెట్టుబడులవైపు మళ్లుతున్న భారతీయ మదుపరులు 
బిజినెస్

మదుపరుల చూపు విదేశీ మార్కెట్ వైపు

దేశీయ మార్కెట్లలో ఏఐ సంబంధిత సంస్థల కొరత, రూపాయి బలహీనత విదేశీ పెట్టుబడులపై మదుపరుల ఆసక్తికి కారణాలుగా నిలుస్తున్నాయి.

Srinivas Rao

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ మధ్య నిరుత్సాహపరుస్తుండటంతో మదుపరులు విదేశాలలో ఏఐ రంగం వైపు దృష్టి సారిస్తున్నారు. ఇన్నాళ్లూ రియల్ ఎస్టేట్, బంగారం, బ్యాంకు డిపాజిట్లను దేశీయ ఈక్విటీలలోకి తరలించిన వారంతా విదేశీ పెట్టుబడులవైపు మళ్లడం దేశీయంగా సంకటస్థితిని సృష్టిస్తోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో 13 కోట్లకు పైగా రిటైల్ స్టాక్ ఇన్వెస్టర్లు ఉన్నారు. స్టాక్ మార్కెట్ బలహీనంగా ఉండటంతో, వీరిలో చాలామంది న్యూయార్క్ నుంచి కజకిస్తాన్ వరకు విదేశాలలో పెట్టుబడి లక్ష్యాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధాన నిఫ్టీ సూచీ గత 2 సంవత్సరాలలో 3 శాతం నష్టపోయింది. ఇదే సమయంలో ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ సూచీ 47 శాతం లాభపడింది. అమెరికాలోని ఎస్ అండ్ పీ 500 సూచీ 32 శాతం వృద్ధి సాధించింది. స్థానిక మార్కెట్లలో ఏఐ సంబంధిత సంస్థలు లేకపోవడం ఇన్వెస్టర్ల అసంతృప్తికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. దేశీయంగా మదుపరుల నిరుత్సాహం కారణంగా కొత్త ఖాతాల ప్రారంభం గణనీయంగా తగ్గిపోయింది.

రికార్డు స్థాయికి విదేశీ పెట్టుబడులు

2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (H1 2026 / మొదటి 6 నెలల కాలంలో) భారతీయులు ప్రత్యక్షంగా లేదా ఫండ్ల ద్వారా చేసిన అంతర్జాతీయ పెట్టుబడులు 230 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 21,886.8 కోట్లు) చేరాయి. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం వ్యక్తిగతంగా విదేశాలకు పంపే మొత్తాలపై పరిమితులు ఉన్నాయి. అయితే గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ పన్ను రహిత కేంద్రం ద్వారా ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ ఆస్తి నిర్వహణ సంస్థ, పరాగ్ పారిఖ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ సంస్థలు ఇటువంటి ఫండ్లను ప్రారంభించాయి. "గడిచిన రెండు సంవత్సరాలలో గ్లోబల్ అసెట్స్ డిమాండ్ స్పష్టంగా పెరిగింది" అని అయోనిక్ అసెట్ సహ వ్యవస్థాపకుడు శోభిత్ మాథుర్ తెలిపారు. "మదుపరులు విదేశీ ఎక్స్‌పోజర్‌ను తాత్కాలిక కేటాయింపుగా కాకుండా పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో శాశ్వత భాగంగా భావిస్తున్నారు" అని ఆయన తెలిపారు. విదేశీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లపై భారీ డిమాండ్ ఏర్పడటంతో వాటి అసలు.. నికర ఆస్తి విలువ కంటే అధిక ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.

సరిహద్దులు దాటుతున్న పెట్టుబడులు

గడిచిన 6 నెలల్లో కనీసం అరడజనుకు పైగా విదేశీ ఫండ్లు పుట్టుకొచ్చాయి. ముకేశ్ అంబానీ జియో ఫైనాన్షియల్, బ్లాక్‌రాక్ సంయుక్త భాగస్వామ్యంతో ‘జియోబ్లాక్‌రాక్’ అడ్వాంటేజ్ వరల్డ్ ఈక్విటీ ఫండ్‌ను తాజాగా ప్రారంభించారు. అయినా మదుపరులు పక్కదారులు వెతుకుతూనే ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రం కోటా ప్రాంతానికి చెందిన అంకిత్ ఖండేల్వాల్ (41) విదేశీ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల గురించి మాట్లాడారు. "ఇది ఒక ప్రయోగంగా మొదలైంది. దేశంలో బలహీనపడ్డ రూపాయి, విదేశాలలో మెరుగైన రాబడుల కారణంగా నా పోర్ట్‌ఫోలియోలో విదేశీ పెట్టుబడులను 5 నుంచి 60 శాతానికి పెంచాను" అని అంకిత్ ఖండేల్వాల్ వెల్లడించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే..దేశం మొత్తంగా ఇదే తరహాలో కొనసాగుతున్న పరిణామాలు ఆర్థిక రంగ నిపుణులకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. దేశీయ మార్కెట్లను బలోపేతం చేయాల్సిన తరుణంలో మదుపరులు విదేశాల వైపు పరుగులు తీయడం ప్రస్తుతం ఆర్థిక రంగంలో చర్చనీయాంశమైంది.