న్యూ మెక్సికో (అమెరికా): ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచార పరిరక్షణ, తప్పుడు ప్రచార నియంత్రణ విషయంలో మోసపూరిత ప్రకటనలు చేసిందన్న ఆరోపణలపై అమెరికాలోని న్యూ మెక్సికో కోర్టు మెటాకు 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.37 లక్షల కోట్ల) జరిమానా విధించింది.
కేంబ్రిడ్జ్ అనలిటికా కేసుతో మొదలు..
2018లో కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ ప్రకటనల కోసం ఉపయోగించుకుందన్న విషయం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో 2021లో అప్పటి న్యూ మెక్సికో అటార్నీ జనరల్ హెక్టర్ బాల్డెరాస్ మెటాపై తొలిసారి కోర్టులో కేసు వేశారు. ఫేస్బుక్ వినియోగదారుల డేటాను మెటా కంపెనీ దుర్వినియోగం చేస్తోందని, యూజర్ల ప్రైవసీ విషయంలో అబద్ధాలు చెబుతోందని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల పాటు ఇరుపక్షాల లాయర్లు కోర్టుకు వివిధ ఆధారాలు, అంతర్గత పత్రాలు సమర్పిస్తూ వాదనలు వినిపించారు.
ఒక్కో ఉల్లంఘనకు రూ.4.74 లక్షలు చొప్పున ఫైన్
ఈ పిటిషన్పై న్యూ మెక్సికోలోని శాంటా ఫే డిస్ట్రిక్ట్ కోర్టులో సెప్టెంబర్ 8న తుది విచారణ ప్రారంభమైంది. దీన్ని పరిశీలించిన జ్యూరీ సభ్యులు వినియోగదారుల రక్షణ చట్టాన్ని మెటా కంపెనీ 4.3 కోట్ల సార్లు ఉల్లంఘించిందని తేల్చి, దోషిగా ప్రకటించారు. దీని ప్రాతిపదికన ఒక్కో ఉల్లంఘనకు రూ.4.74 లక్షలు (5వేల డాలర్లు) చొప్పున.. 4.3 కోట్ల ఉల్లంఘనలకుగానూ మెటాపై మొత్తం 25 బిలియన్ డాలర్లను జరిమానాగా విధిస్తూ న్యాయమూర్తి ఫ్రాన్సిస్ మాథ్యూ బుధవారం తుది తీర్పును వెలువరించారు. దీనిపై మెటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల న్యూ మెక్సికో రాష్ట్రంలో వ్యాపారం చేయడం అసాధ్యంగా మారుతుందని పేర్కొంటూ, దీనిపై పైకోర్టులో అప్పీల్ చేస్తామని మెటా చీఫ్ లీగల్ ఆఫీసర్ వెల్లడించారు.