న్యూఢిల్లీ : ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.21 కోట్లుగా ఉన్న నికర లాభం.. ఈసారి రూ.226 కోట్లకు చేరింది. సంస్థ కార్యకలాపాల ఆదాయం కూడా 28 శాతం పెరిగి రూ.2,648 కోట్లకు చేరుకుంది.
పెరిగిన ఆదాయం
భారత కార్పొరేట్ సంస్థలు రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తున్న వేళ పేటీఎం కూడా తన ఆర్థిక గణాంకాలను వెల్లడించింది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ నికర లాభం గతేడాది ఇదే కాలంలోని రూ.21 కోట్ల నుంచి రూ.226 కోట్లకు పెరిగింది. అంటే లాభం దాదాపు 10.8 రెట్లు పెరిగింది.
ఎబిటా 91.5 శాతం వృద్ధి
జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో పేటీఎం ఎబిటా రూ.142 కోట్ల నుంచి రూ.270 కోట్లకు పెరిగింది. ఎబిటా మార్జిన్ కూడా గతేడాది ఇదే సమయంలో ఉన్న 6.8 శాతం నుంచి 10.2 శాతానికి మెరుగుపడింది. వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించడం, కొత్త వ్యూహాలతో ముందుకు సాగడం ద్వారా ఈ వృద్ధిని సాధించినట్లు సంస్థ తెలిపింది.