Narendra Modi launches development projects in Ladakh 
బిజినెస్

లద్దాఖ్‌ ప్రగతిలో కీలక అధ్యాయం

రూ.3,350 కోట్లతో ఏర్పాటు చేసిన ఐదు ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభం చేసి, కార్యక్రమంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Madhu

న్యూఢిల్లీ: లద్దాఖ్‌లో విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, రహదారి కనెక్టివిటీ సహా ఐదు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ సుమారు రూ.3,350 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ “లడఖ్‌ ప్రగతి, అభివృద్ధిలో మరో అధ్యాయం చేరింది. సాంకేతికత ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. లడఖ్‌లో పలు ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు నేడు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా ప్రజల ప్రయాణాలు సులభతరం అవుతాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయాలు మెరుగుపడతాయి. మరికొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత పెరుగనున్నది. మన ప్రాచీన వారసత్వ పరిరక్షణకు కూడా ఈ ప్రాజెక్టులు తోడ్పడుతాయి” అని అన్నారు.

 రూ.640 కోట్లతో టెర్మినల్

లేహ్‌లోని కుషోక్ బకులా రింపోచే విమానాశ్రయంలో రూ.640 కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభించారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్‌ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో రూపొందించారు. టెర్మినల్‌ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలతో లద్దాఖ్‌ విమానయాన అనుసంధానం మరింత బలోపేతం కానున్నది.

 298 కిలోమీటర్ల వ్యూహాత్మక రహదారి

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము-పదుమ్- దార్చా రహదారిని కూడా మోదీ జాతికి అంకితం చేశారు. లేహ్‌లోని నిమ్మును హిమాచల్‌ప్రదేశ్‌లోని దార్చాతో మారుమూల జన్‌స్కార్ లోయ మీదుగా అనుసంధానించే ఈ రహదారి లడఖ్‌కు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా ఉపయోగపడనున్నది. ప్రస్తుతం ఉన్న శ్రీనగర్‌-లేహ్, మనాలి-లేహ్ జాతీయ రహదారులకు ఇది అదనపు అనుసంధాన మార్గంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. కఠినమైన హిమాలయ పర్వత ప్రాంతాల్లో, ఎత్తైన షింకున్ లా కనుమ మీదుగా ఈ రహదారిని నిర్మించడం గొప్ప ఇంజినీరింగ్‌ విజయంగా అభివర్ణించారు. సైనిక దళాల రాకపోకలకు, అవసరమైన సామగ్రి సరఫరాకు ఈ మార్గం ఎంతో కీలకం కానున్నది. అలాగే జన్‌స్కార్ ప్రాంత ప్రజలకు వైద్యం, విద్య, మార్కెట్లు, ఇతర నిత్యావసర సేవలు మరింత చేరువ కానున్నాయి.

 విద్యుత్ రంగానికి మరింత బలం

లడఖ్‌లో ఇంధన భద్రతను బలోపేతం చేయడంతోపాటు పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకునే దిశగా 9 మెగావాట్ల హను చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. 66 కేవీ సామర్థ్యంతో నిర్మించిన డబుల్ సర్క్యూట్ డహ్‌-హను-ఖల్త్సీ విద్యుత్ ప్రసార లైన్‌ను కూడా జాతికి అంకితం చేశారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతోపాటు లడఖ్‌లో విద్యుత్ నెట్‌వర్క్ విశ్వసనీయత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో జలవిద్యుత్ వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి ఇవి దోహదపడనున్నాయన్నారు.

 దేశంలోనే తొలి పెట్రోగ్లిఫ్ పరిరక్షణ పార్కు

లడఖ్‌ ప్రాచీన పురావస్తు వారసత్వాన్ని కాపాడేందుకు లేహ్‌లోని సింధు ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి పెట్రోగ్లిఫ్ పరిరక్షణ పార్కును కూడా మోదీ ప్రారంభించారు. లడఖ్‌లో వందలాది చారిత్రక శిలాచిత్రాల ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో జంతువులు, మానవ ఆకృతులు, వివిధ సంకేతాలను రాతిపై చెక్కిన చిత్రాలు కనిపిస్తాయి. వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మానవ జీవనం, సంస్కృతి, చరిత్ర ఎలా ఉండేవో తెలుసుకోవడానికి ఇవి విలువైన ఆధారాలుగా నిలుస్తున్నాయి. ఈ పార్కు ద్వారా అటువంటి ప్రాచీన వారసత్వ సంపదను పరిరక్షించనున్నారు.

 గ్రామాల్లో జలవనరుల అభివృద్ధి

లడఖ్‌లో నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ హిమ్ సరోవర్‌’ కింద 40 గ్రామాల్లో అభివృద్ధి చేసిన 40 నీటి వనరులను కూడా ప్రధాని ప్రారంభించారు. మిషన్ అమృత్ సరోవర్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. లడఖ్‌లో వ్యవసాయానికి అవసరమైన నీటి లభ్యతలో కాలానుగుణ అసమతుల్యత ప్రధాన సమస్యగా ఉంది. విత్తనాలు నాటే కీలక సమయంలో రైతులు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు మంచు కరగడం, హిమానీనదాల నుంచి వచ్చే నీటి ప్రవాహం ఇతర కాలాల్లో అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నీరు అందుబాటులో ఉన్నప్పుడు దానిని నిల్వ చేసి, అవసరమైన సమయంలో వినియోగించుకునేలా ప్రాజెక్ట్ హిమ్ సరోవర్‌ను చేపట్టారు. దీని ద్వారా సాగునీటి అవసరాలు తీరడంతోపాటు రైతుల జీవనోపాధికి మద్దతు లభించనున్నదని అధికారులు తెలిపారు.