ముంబై: భారత స్టాక్ మార్కెట్‌ను మళ్లీ గాడిన పెట్టడానికి, పెట్టుబడులను పెంచడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. మన దేశంలోని సాధారణ ప్రజలు, మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లు ఎస్ఐపీ (సిప్)లు చేయడం ద్వారా మూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ పెట్టుబడుల నుంచి ఆర్జించే లాభాలపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని కేంద్రానికి సెబీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఒక మూచువల్ ఫండ్ స్కీం నుంచి మరొక స్కీంలోకి మారినప్పుడు విధించే పన్ను నుంచీ ప్రజలకు మినహాయింపును కల్పించాలని సిఫారసు చేసింది. దీనివల్ల సాధారణ భారతీయులు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) కన్నా మ్యూచువల్ ఫండ్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారని అంచనా వేస్తున్నారు. ఎస్ఐపీల ద్వారా మూచువల్ ఫండ్స్‌లోకి నిరంతరం నిధుల ప్రవాహం కొనసాగితే సరిపడా ద్రవ్య లభ్యతతో స్టాక్ మార్కెట్ స్థిరంగా కదలాడుతుందని పరిశీలకులు అంటున్నారు.
విదేశీ ఇన్వెస్టర్ల రాబడులకు రెక్కలు
విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత షేర్ మార్కెట్లో ఏడాది కంటే ఎక్కువ కాలంపాటు షేర్లను ఉంచుకొని, ఆ తర్వాత లాభాలతో అమ్మినప్పుడు కట్టాల్సిన ‘లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్’ (ఎల్టీసీజీ) పన్నును పూర్తిగా రద్దు చేయాలని సెబీ ప్రతిపాదించింది. ఈ సిఫారసును కేంద్ర సర్కారు ఆమోదిస్తే, భారత స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల రాబడులు 2.3 శాతం మేర పెరిగే అవకాశం ఉంటుందని అంచనా. గత రెండేళ్లలో నిఫ్టీ50 దాదాపు 4.8 శాతం పతనమైంది. ఇక ఇదే సమయంలో భారత్ సహా 24 అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్ల కదలికలను ట్రాక్ చేసే ‘ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్’ 40 శాతం పెరిగింది. అంటే, ఇతరత్రా దేశాల మార్కెట్ల రేంజ్లో భారత మార్కెట్ సానుకూల ఫలితాలను సాధించలేకపోయింది. గత ఏడాది వ్యవధిలోనే విదేశీ ఇన్వెస్టర్లు రూ.2.93 లక్షల కోట్లు విలువైన భారత కంపెనీల షేర్లను అమ్మేసి నిష్క్రమించారు. ఎల్టీసీజీ పన్నును రద్దు చేస్తే, విదేశీయులు మళ్లీ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారని సెబీ భావిస్తోంది.
తుది నిర్ణయం కేంద్రం చేతుల్లోనే
కేంద్ర ప్రభుత్వం 2027 ఫిబ్రవరిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ రూపకల్పన కోసం ముమ్మర కసరత్తు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో విదేశీ ఇన్వెస్టర్లు, భారతీయ మిడిల్ క్లాస్ ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ చేసిన ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, వీటిపై తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే.