ఫేస్‌బుక్‌, స్నాప్‌చాట్‌లోని ఆటోప్లే, ఇన్‌ఫినిట్ స్క్రోలింగ్ ఫీచర్లు తమను వ్యసనానికి గురిచేశాయని ఇద్దరు బాలికలు లాస్‌ ఏంజెల్స్ కోర్టును ఆశ్రయించారు. 
బిజినెస్

ఫేస్ బుక్, స్నాప్ చాట్ పై కోర్టుకెక్కిన బాలికలు

ఆటోప్లే, స్క్రోలింగ్ ఫీచర్ల వల్ల సోషల్ మీడియాకు బానిసలమయ్యామంటూ ఇద్దరు బాలికలు వేసిన కేసు విచారణ ప్రారంభమైంది. జుకర్‌బర్గ్ హాజరయ్యే అవకాశంపై పూర్తి వివరాలు.

Haji Pasha

లాస్​ ఏంజెల్స్​: మెటా (ఫేస్​బుక్​), స్నాప్​చాట్​ వాడకం వల్ల తమకు మానసిక సమస్యలు వచ్చాయంటూ ఇద్దరు బాలికలు కోర్టును ఆశ్రయించారు. ఇల్లినాయిస్‌కు చెందిన 16 ఏళ్ల ఎస్​జే, మిసిసిపీకి చెందిన 18 ఏళ్ల కేడీబీ 2023లో లాస్ ఏంజెల్స్ సుపీరియర్ కోర్టులో వేసిన కేసు విచారణ ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత బుధవారం ప్రారంభమైంది. తాము చిన్న వయసు నుంచే సోషల్ మీడియా వాడటం ప్రారంభించామని బాధిత బాలికలు కోర్టుకు తెలిపారు. ఫేస్​బుక్, స్నాప్​చాట్​ యాప్​లలోని ఆటోప్లే, ఇన్‌ఫినిట్ స్క్రోలింగ్ వంటి ఫీచర్లు తమను వాటికి బానిసలుగా మార్చుకున్నాయని  వారు ఆరోపించారు. ఫలితంగా తాము మానసిక కుంగుబాటు(డిప్రెషన్)తో పాటు ఆహార అలవాట్ల సమస్యల బారిన పడ్డామని చెప్పారు. రాత్రిళ్లు గంటల తరబడి నిద్రలేకుండా ఫోన్లు చూశామని, తమకు తాము హాని చేసుకున్నామని కోర్టుకు నివేదించారు. ఈ కేసు విచారణ ఇంకొన్ని వారాల పాటు కొనసాగనుంది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి, స్నాప్ సీఈవో ఇవాన్ స్పీగెల్ కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చే అవకాశముంది.

టిక్​టాక్​, యూట్యూబ్​తో  ఈ ఇద్దరి సెటిల్​మెంట్​

ఈ ఇద్దరు టీనేజర్లు (ఎస్​జే, కేడీబీ) కలిసి 2023లోనే టిక్​టాక్​, యూట్యూబ్​లపైనా కేసులు వేశారు. అయితే 2026 ఆగస్టులో కేసు విచారణ ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందే టిక్​టాక్​తో కోర్టు బయట రాజీ కుదుర్చుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్​లోనే యూట్యూబ్​తోనూ వీరు రాజీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇల్లినాయిస్‌కు చెందిన ఎస్​జే ఇటీవలే ఫేస్​బుక్​తో రాజీ కుదుర్చుకొని కేసు వెనక్కి తీసుకుంది. తాజాగా బుధవారం ప్రారంభమైన న్యాయ విచారణ ఈ ఇద్దరు స్నాప్​చాట్​పై వేసిన పిటిషన్లు, ఫేస్​బుక్​పై  మిసిసిపీకి చెందిన కేడీబీ పెట్టిన కేసుపైనే జరుగుతోంది.

మమ్మల్ని బాధ్యులుగా భావిస్తే ఎలా ? : మెటా

యువతీ, యువకుల మానసిక ఆరోగ్యాన్ని రకరకాల అంశాలు ప్రభావితం చేస్తుంటాయని మెటా అధికార ప్రతినిధి అంటున్నారు. ఇందుకు తమను బాధ్యులుగా భావించడం సరికాదని ఆయన చెబుతున్నారు.  బాధిత టీనేజర్​ తమకు చెందిన ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ కంటే టిక్​టాక్​నే ఎక్కువగా వాడిందని పేర్కొంటున్నారు.    

పొంతన లేని ఆరోపణ ఇది : స్నాప్​చాట్​

తమ సోషల్​ మీడియా వేదికలో కమ్యూనిటీకే పెద్దపీట వేస్తామని, ప్రజలు ఎక్కువ చూసే కంటెంట్​ను పుష్​ చేయడమనేది ఉండదని స్నాప్​చాట్​ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. బాధిత టీనేజర్లు చేస్తున్న ఆరోపణకు, స్నాప్​చాట్​ పనితీరుకు అస్సలు పొంతన కుదరడం లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఆ ఫీచర్లు యమ డేంజర్​ : బాధితురాలి తరఫు న్యాయవాది

‘‘ఫేస్​బుక్​, స్నాప్​చాట్​లలో స్క్రీన్‌ను స్క్రోల్ చేస్తున్న కొద్దీ కొత్త పోస్టులు, రీల్స్, వీడియోలు వస్తూనే ఉంటాయి. ఆటో ప్లే, స్ట్రీక్స్​ లాంటి ఫీచర్లు యువత యాప్స్​కు అడిక్ట్​ అయ్యేలా చేస్తున్నాయి. సోషల్​ మీడియా నుంచి యువతరం ఎదుర్కొంటున్న ఈ ముప్పులను కోర్టుకు తెలియజేయాలి అనేది మా ప్రధాన లక్ష్యం” అని మిసిసిపీకి చెందిన టీనేజర్​ కేడీబీ తరఫు న్యాయవాది ఎమిలీ జెఫ్​కాట్​ పేర్కొన్నారు.

గతంలోనూ ఇలాంటిదే ఓ కేసు

అమెరికాలో సోషల్ మీడియా కంపెనీలపై ఇలాంటివి దాదాపు 3వేలకుపైగా కేసులు ఉన్నాయి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లకు బానిస కావడం వల్ల తనకు మానసిక సమస్యలు వచ్చాయంటూ కేలీ జి.ఎమ్ అనే యువతి 2023 జూలై 25న లాస్ ఏంజెల్స్ కోర్టులోనే కేసు వేసింది. దీనిపై విచారణ ఈ ఏడాది మార్చిలోనే ముగిసింది. ఈ కేసులో మెటా(ఇన్‌స్టాగ్రామ్), గూగుల్ (యూట్యూబ్)లను దోషులుగా జ్యూరీ తేల్చింది. ఈ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరించి యాప్స్​ను వ్యసనపూరితంగా మార్చాయని స్పష్టం చేసింది. రెండు కంపెనీలకు కలిపి దాదాపు రూ.50 కోట్ల (6 మిలియన్ డాలర్ల) నష్టపరిహారాన్ని విధించింది. ఇందులో 70 శాతాన్ని మెటా, 30 శాతాన్ని గూగుల్ చెల్లించాలని ఆదేశించింది.