Nana Patekar  
సినిమా

‘షూటింగ్’లోనూ సూపర్‌స్టార్

60 ఏళ్ల వయసులో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న నానా పాటేకర్

S. Pavan

ముంబై, అక్టోబర్ 8: ప్రముఖ నటుడు నానా పాటేకర్ సినిమాలతోపాటు షూటింగ్ క్రీడలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. షూటింగ్ క్రీడలో యువ క్రీడాకారులకు తనవంతు సాయం అందిస్తూ నిజమైన హీరో అనిపించుకున్నారు. ఒక సినిమాలో తన పాత్ర కోసం తుపాకీ కాల్చటంపై తీసుకున్న శిక్షణ, ఆయనను జీవితాంతం షూటింగ్ క్రీడ వైపు నడిపించింది.  1991లో ‘ప్రహార్’ సినిమా కోసం నానా పాటేకర్‌ భారత సైన్యం వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తుపాకీని గురిపెట్టడం, కాల్చటం కేవలం సినిమా కోసం నేర్చుకున్న విద్యగా కాకుండా, క్రీడా పోటీల్లో పాల్గొనటం వరకు కొనసాగించారు. చిన్న చిన్న లక్ష్యాలను టార్గెట్ చేసుకుంటూ చివరకు మినరల్‌ వాటర్‌ బాటిల్‌ మూతలను కూడా గురిచూసి కొట్టే స్థాయికి చేరుకున్నారు. 2004లో ఇండోర్‌లో బీఎస్ఎఫ్ నిర్వహించిన జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 300 మీటర్ల విభాగంలో వెండి పతకం అందుకున్నారు. 2007లో మహారాష్ట్ర జట్టు తరఫున కాంస్య పతకం గెలిచారు. వ్యక్తిగత విభాగంలో 12వ స్థానంలో నిలిచారు. షూటింగ్‌లో సాధించిన విజయాలతో ‘ప్రముఖ షూటర్’ అనే బిరుదు కూడా లభించింది. ఈ క్రీడ పట్ల తనకున్న అభిమానం కారణంగా నానా పాటేకర్‌ ఇతర షూటర్లకు కూడా సహాయం చేసేవారు. శిక్షణ, బుల్లెట్లు, షూటింగ్‌ పరికరాల కోసం అయ్యే ఖర్చులను భరించలేని యువ క్రీడాకారులకు తన వంతు సాయం అందించారు. జాతీయ స్థాయి షూటర్లకు పతకాలతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. యువ క్రీడాకారులకు డబ్బు అందితే వారు తమ ప్రతిభను కొనసాగించేందుకు మరింత ధైర్యం వస్తుందని అభిప్రాయపడ్డారు.