లాస్ ఏంజిల్స్: ప్రపంచ సినీ చరిత్రలో తొలిసారిగా పూర్తి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా రూపొందిన చిత్రం ఆస్కార్ అవార్డుల బరిలో నిలవనుంది. ప్రముఖ ఏఐ స్టూడియో 'ఫేబుల్' నిర్మించిన ‘గాడ్స్ డోంట్ గివ్ గిఫ్ట్స్’ సినిమా విడుదల తేదీని అక్టోబర్ 30 బదులు డిసెంబర్ 4కు వాయిదా వేశారు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రచార సీజన్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. యూట్యూబర్ జాక్ లండన్ (గాసిప్ గోబ్లిన్) రూపొందించిన 4 కథల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది.
యానిమేషన్ విభాగంలో పోటీ
ఈ చిత్రాన్ని అకాడమీ అవార్డుల్లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో నామినేషన్ కోసం పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం అకాడమీ సభ్యులకు ప్రత్యేక ప్రదర్శనలు, విమర్శకులకు ప్రీ-రిలీజ్ షోలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే నెల లాస్ ఏంజిల్స్ అంతటా భారీ ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. "ఐదేళ్లుగా ఏఐ సినిమా ఎప్పుడు ఆస్కార్ గెలుచుకుంటుందన్న చర్చ నడుస్తోంది.. ఆ దిశగా నిలిచే తొలి చిత్రం ఇదే అవుతుంది" అని ఫేబుల్ సీఈవో ఎడ్వర్డ్ సాచీ పేర్కొన్నారు. ప్రస్తుత తరానికి ఇది మరో ‘టాయ్ స్టోరీ’ లాంటి మైలురాయిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అకాడమీ నిబంధనలే కీలకం
మానవుల సృజనాత్మకత ఏ మేరకు ఉందనే అంశం ఆధారంగానే ఏఐ చిత్రాల ప్రతిభను గుర్తిస్తామని అకాడమీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ అకాడమీ ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందనే అంశం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. భారీ హింసాత్మక సన్నివేశాల కారణంగా చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఆర్’ (R) రేటింగ్ ఇచ్చింది. సాంకేతిక పరిమితులను దాటి మానవ భావోద్వేగాలను సరికొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయోగంగా దర్శకుడు జాక్ లండన్ ఈ చిత్రాన్ని అభివర్ణించారు.