Nana Patekar 
సినిమా

రియల్​ హీరో : రూ.35 నుంచి రూ.3 కోట్ల దాకా

బాలీవుడ్​ యాంగ్రీ మ్యాన్ నానా పాటేకర్​ కెరీర్​లో ఎన్నో మలుపులు ​మహానటుడిగా, మానవతా వాదిగా అమర ప్రస్థానం

Haji Pasha

నెలకు కేవలం రూ.35 సంపాదించిన ఓ టీనేజీ కుర్రాడు, ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరేమో! ఒకప్పుడు సినిమాల పోస్టర్లకు రంగులు, జీబ్రా క్రాసింగ్​లకు పెయింట్లు వేసిన ఆ చిట్టి చేతులు, తదుపరిగా వందలాది రైతుల కుటుంబాలను ఆదుకుంటాయని ఎవరూ అంచనా వేసి ఉండరేమో! ఓ వైపు సినీ రంగంలో రాణిస్తూ, మరోవైపు మానవతా కార్యక్రమాలను నిర్వహించిన మనసున్న మారాజు, రియల్​ హీరో నానా పాటేకర్​ ఇక లేరు. క్రాంతివీర్ (1994)​ సినిమాలో 'ప్రతాప్ నారాయణ్ తిలక్', వెల్కమ్(2007)లో 'ఉదయ్ శెట్టి',  పరిందా (1989)లో 'అన్నా సేథ్' పాత్రల్లో జీవించిపోయిన ఆ మహా నటుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

కారు కొనేందుకు దాచుకున్న రూ.1.50 కోట్లను ఆత్మహత్య చేసుకున్న 250 రైతుల కుటుంబాలకు పంచేసిన ఆ ఆపద్బాంధవుడు అస్తమించాడు. కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీలో పనిచేసిన దేశభక్తుడు నానా పాటేకర్ ఇప్పుడు మనమధ్యలో లేరు. ​1989‌‌–1996 మధ్యకాలంలో కేవలం తొమ్మిదేళ్లలో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్న ముద్దుబిడ్డను కళామతల్లి కోల్పోయింది. విలన్​గా, కమెడియన్​గా, హీరోగా, మానవతావాదిగా విభిన్న కోణాలు కలిగిన నానా పాటేకర్​ ఇక లేరనే వార్త యావత్​ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ధ్రువతారను కోల్పోయిన సినీరంగం

భారతీయ సినీ రంగం మరో గొప్ప ధ్రువతారను కోల్పోయింది. నటుడిగానే కాకుండా, ‘నామ్ ఫౌండేషన్’ ద్వారా వేలాది రైతులను ఆదుకున్న గొప్ప మానవతావాది నానా పాటేకర్​ను సమాజం కోల్పోయింది. డైలాగ్ డెలివరీలోనూ, నిజ జీవితంలోనూ ఆయన చూపించిన నిజాయతీ, సాహసం మరెవరికీ సాధ్యం కావు. తెరపై ఆయన వదిలివెళ్లిన విలక్షణ పాత్రలు, సమాజానికి చేసిన సేవలు చరిత్రలో ఎప్పటికీ సజీవంగా నిలిచిపోతాయి. ఈ విషాదకర సందర్భంలో నానా పాటేకర్​ స్ఫూర్తిదాయక సినీ ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం.

13 ఏళ్ల వయసులోనే పెద్ద సవాల్​

నానా పాటేకర్​ అసలు పేరు విశ్వనాథ్ పాటేకర్. ఆయన 1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుద్-జంజీరా ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి ముంబైలో చిన్నతరహా టెక్స్‌టైల్ వ్యాపారం చేసేవారు. తల్లి గృహిణి. మొదట్లో వీరి కుటుంబం ఆర్థికంగా స్థిరంగానే ఉండేది. అయితే దగ్గరి బంధువు ఒకరు చేసిన మోసం వల్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతిని, ఆస్తి అంతా పోయింది. ఈ వ్యాపార సంక్షోభం వల్ల నానా పాటేకర్​ కుటుంబం రాత్రికి రాత్రే తీవ్ర పేదరికంలోకి కూరుకుపోయింది. దీంతో 13 ఏళ్ల వయసులోనే (1964లో) నానా పాటేకర్ ఓ వైపు చదువుకుంటూ, మరోవైపు పని చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన రోజూ స్కూల్ ముగిసిన తర్వాత మైళ్ల దూరం నడిచి వెళ్లి, సినిమాల పోస్టర్లకు రంగులు వేస్తే ప్రతినెలా రూ.35 వచ్చేవి. ఆ రోజుల్లో రాత్రి వేళల్లో ట్రాఫిక్ ఆగిపోయిన తర్వాత, అంటే అర్ధరాత్రి 1:00 లేదా 1:30 గంటల సమయంలో పాటేకర్​, ఆయన స్నేహితులు రోడ్లపైకి వెళ్లి జీబ్రా క్రాసింగ్‌లకు పెయింట్లు వేసేవారు. ప్రతి జీబ్రా క్రాసింగ్​ను పెయింట్ చేసినందుకు  పాటేకర్​కు రూ.15 ఇచ్చేవారు. ఇలా సంపాదించిన డబ్బుతోనే తన చదువును, కుటుంబ అవసరాలను ఆయన వెళ్లదీశారు.

ఓ వైపు చదువు.. మరోవైపు పని, నాటకాలు

బతుకుదెరువు కోసం రోడ్లపై జీబ్రా క్రాసింగ్‌లకు రంగులు వేసే పనిని చేస్తున్న వేళ కూడా నానా పాటేకర్​ మనస్థైర్యాన్ని కోల్పోలేదు. నటుడు కావాలనే జీవిత లక్ష్యాన్ని వదులుకోలేదు. సినీ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టినా, ఆర్థిక సమస్యలు అలుముకున్నా ఆయన వెరువలేదు. 1960వ దశకంలో విద్యార్థి దశలోనే నాటకాలు, డ్రామాలలో చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలుపెట్టారు. అనంతరం  ముంబైలోని ప్రసిద్ధ సర్ జేజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ నుంచి కమర్షియల్ ఆర్ట్స్‌లో పట్టా పొందారు. అనంతరం కొంతకాలం పాటు ఒక అడ్వర్టయిజింగ్​ ఏజెన్సీలో కమర్షియల్ ఆర్టిస్టుగా ఉద్యోగం  చేశారు. ఇక 1970వ దశకం ప్రారంభం నుంచి నానా పాటేకర్​ మరాఠీ ప్రయోగాత్మక, వాణిజ్య నాటక రంగంలో అత్యంత చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. సినిమాల్లోకి రాకముందు వేసిన 'పురుష్', 'హమీదాబాయి ఛీ కోఠి', 'మహా సాగర్' వంటి నాటకాలు ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 'పురుష్' నాటకంలో ఆయన పోషించిన విలన్ పాత్రకు అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

నాథూరామ్ గాడ్సే పాత్రలో అద్భుత నటన

కట్​ చేస్తే, 1978లో 27 ఏళ్ల వయసులో ‘మీమ గమన్’ అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి నిశ్శబ్దంగా నానా పాటేకర్​ అడుగుపెట్టారు. అదే ఏడాది 'గదద్ జాలీ' అనే మరాఠీ చిత్రంలోనూ నటించారు. తదుపరి కొన్నేళ్లలో అనేక మరాఠీ చిత్రాలలో ఆయనకు అవకాశాలు లభించాయి. ఈక్రమంలోనే 1986లో బ్రిటన్​కు చెందిన ప్రఖ్యాత టెలివిజన్ సిరీస్ ‘లార్డ్ మౌంట్​బాటన్​ : ది లాస్ట్ వైస్రాయ్’లో నాథూరామ్ గాడ్సే పాత్రలో పాటేకర్​ అద్భుతంగా నటించారు. ఫలితంగా మరిన్ని సినీ అవకాశాలు ఆయన ఎదుట క్యూ కట్టాయి. నానా పాటేకర్​కు గుర్తింపు తెచ్చిన తొలి హిందీ చిత్రాలలో ఒకటి 'ఆజ్ కీ ఆవాజ్' (1984).

కీలక మైలురాయి ‘అంకుశ్​’

ఇక 1986 జులై 21న విడుదలైన ‘అంకుశ్​’ సినిమా ఆయన కెరీర్​కు కీలక మైలురాయిగా మారింది. నలుగురు నిరుద్యోగ యువకులు తప్పుదారి పట్టగా, వారిని పొరుగునే ఉండే తల్లీకూతుళ్లు సరిదిద్దే కథనంతో ఈ మూవీ సాగింది. ఆ కూతురిపై లైంగిక దాడి జరిగినప్పుడు, నలుగురు యువకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. ఈ సినిమాలో నానా పాటేకర్​ ఉత్సాహభరిత నటన, వేగంగా మాట్లాడే సంభాషణలు ప్రేక్షకుల మదిదోచాయి. ఈ పాత్రే తర్వాతి కాలంలో 'నానా పాటేకర్​ టెంప్లేట్'గా మారిపోయింది. ఈవిధంగా ఎన్నో కష్టనష్టాలను ఓర్చి.. హిందీ, మరాఠీ సినిమాలలో దిగ్గజ నటుడిగా ఆయన చెరగని ముద్ర వేశారు.

విలన్​, సపోర్టింగ్​ యాక్టర్​ నుంచి హీరో దాకా

·       1987లో మీరా నాయర్​కు చెందిన ‘సలామ్​ బాంబే’ సినిమాలో నానా పాటేకర్ నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఆస్కార్​కు కూడా నామినేట్​ అయింది.

·       తదుపరిగా ‘పరిందా’ మూవీలో చక్కటి నటనకుగానూ పాటేకర్​కు తొలిసారిగా ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్​ ఫిల్మ్​ అవార్డు లభించింది.

·         1991లో నానా పాటేకర్​ సినీ దర్శకుడిగా మారారు. తొలిసారిగా ఆయన దర్శకత్వంలో ప్రహార్​ సినిమా విడుదలైంది. ఇందులో పాటేకర్ సరసన మాధురీ దీక్షిత్​ నటించారు. ఈ మూవీలో రిటైర్డ్​ ఆర్మీ ఆఫీసర్​గా ప్రధాన​ పాత్రను ఆయన పోషించారు. అయితే ఇది బాక్సాఫీస్​ దగ్గర మోస్తరు విజయాన్నే సాధించగలిగింది. కానీ కేబుల్​ టీవీలో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ​

·       1990వ దశకం మధ్య కాలంలో తిరంగా (1993), క్రాంతివీర్ (1994) సినిమాలు నానా పాటేకర్‌ను బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టగలిగే ఒక స్టార్ హీరోగా మార్చేశాయి. అంతకుముందు వరకు పాటేకర్‌ను కేవలం గొప్ప నటుడిగా, విలన్‌గా మాత్రమే చూసేవారు. కానీ ఈ రెండు సినిమాలు ఆయనను కమర్షియల్ సక్సెస్ ఇచ్చే మెయిన్ లీడ్ హీరోగా నిలబెట్టాయి.

·       'తిరంగా'లో రాజ్‌కుమార్‌తో కలిసి పాటేకర్​ చేసిన నటన, 'క్రాంతివీర్'లో సమాజంపై ఆయన పలికే ఆవేశపూరితమైన డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించాయి. 'క్రాంతివీర్' సినిమాకు గానూ ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా లభించాయి.

·       చివరిసారిగా 2004లో అబ్​ తక్​ ఛప్పన్​ సినిమాలో ఎన్​కౌంటర్​ స్పెషలిస్ట్​గా లీడ్​ రోల్​లో నానా పాటేకర్​ నటించారు. ఇది కమర్షియల్​గా విజయవంతమైంది.

2005 –2026 : నవ్వులు పూయించారు, ఎమోషన్ పండించారు​

  • అపహరణ్ (2005): ప్రకాశ్​ ఝా దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్ క్రైమ్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న 'తబ్రోజ్ ఆలం' పాత్రకుగానూ నానా పాటేకర్​కు ఉత్తమ విలన్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.

  • టాక్సీ నంబర్ 9211 (2006): ఇందులో నానా పాటేకర్ ఒక క్యాబ్ డ్రైవర్‌గా కామెడీ, ఎమోషన్స్‌ను పండించారు. జాన్ అబ్రహంతో కలిసి ఆయన చేసిన నటన, సినిమాలోని డైలాగులు పెద్ద హిట్ అయ్యాయి.

  • వెల్కమ్ (2007): ఈ చిత్రం నానా పాటేకర్ కెరీర్‌లో ఒక మైలురాయి. ఒక కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ కామెడీ చేస్తే ఎలా ఉంటుందో 'ఉదయ్ శెట్టి' పాత్ర ద్వారా చూపించి థియేటర్లలో నవ్వులు పూయించారు. ఈ సినిమా ద్వారా ఆయన పూర్తిస్థాయి కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు పరిచయమైంది.

  • రాజ్‌నీతి (2010): మహాభారతంలోని కృష్ణుడి పాత్ర ఆధారంగా రూపొందించిన 'బ్రిజ్ గోపాల్' అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పాత్రలో పాటేకర్​ నటించారు. ఎంతో ప్రశాంతంగా ఉంటూనే రాజకీయ ఎత్తుగడలు వేసే ఈ పాత్ర ఆయనకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది.

  • నటసామ్రాట్ (2016): ఇది మరాఠీ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం. రిటైర్ అయిన ఒక వృద్ధ రంగస్థల నటుడి (గణపత్ బెల్వల్కర్​) జీవితాన్ని, ఆయన పడే ఎమోషనల్ పెయిన్‌ను నానా పాటేకర్ జీవించి చూపించారు. ఈ చిత్రానికిగానూ ఆయన ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డును అందుకున్నారు.

  • కాలా (2018): సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దీటైన విలన్​గా 'హరిదేవ్ అభయంకర్' అనే పాత్రలో నానా పాటేకర్ అద్భుతంగా నటించారు. దీనితో ఆయన తమిళ చిత్రసీమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

  • ది వ్యాక్సిన్ వార్ (2023): వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన బయో-సైన్స్ చిత్రమిది. ఇందులో కొవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిన భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చీఫ్ డాక్టర్ బలరామ్ భార్గవ పాత్రను  పాటేకర్​ పోషించారు.

  • వనవాస్ (2024) & హౌస్‌ఫుల్ 5 (2025): 2024లో అనిల్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఎమోషనల్ డ్రామా 'వనవాస్' లో తండ్రి పాత్రలోనూ, 2025లో వచ్చిన మల్టీస్టారర్ కామెడీ చిత్రం 'హౌస్‌ఫుల్ 5' లో 'ధగ్దు' పాత్రలోనూ పాటేకర్​  నటించి మెప్పించారు.

  • సుబేదార్ & ఓ రోమియో (2026): 2026 ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన 'సుబేదార్'లోని 'నానా వాఘ్మారే' పాత్ర, అలాగే విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన 'ఓ రోమియో'లోని 'ఇస్మాయిల్ ఖాన్' పాత్రలు నానా పాటేకర్ చివరి దశ వరకు నటనపై చూపించిన అంకితభావానికి నిదర్శనాలుగా నిలిచాయి.

చివరి సోషల్​ మీడియా పోస్ట్​ ఇదే

76 ఏళ్ల వయసులోనూ సినీ పరిశ్రమతో నానా పాటేకర్ అనుబంధాన్ని కొనసాగించారు. ఆయన చివరి సోషల్​ మీడియా పోస్టు కూడా సినిమా ప్రాజెక్టుకు సంబంధించినదే. 'ఓ' రోమియో' మూవీ 2026 ఫిబ్రవరి 13న విడుదలైంది. ఇందులో డీసీపీ ఇస్మాయిల్​ ఖాన్​ అనే పోలీసు అధికారి పాత్రను పాటేకర్​ పోషించారు. అయితే ఈ మూవీ 2026 ఏప్రిల్​ 10న అమెజాన్​ ప్రైమ్​ వీడియోలో రిలీజ్​ అయింది. తదుపరిగా ఓ ప్రముఖ టీవీ ఛానల్​లోనూ ప్రసారమైంది. దీనికి సంబంధించిన ఓ సందేశాన్ని 2026 జూన్​ 25న ఇన్​స్టాగ్రామ్​లో పాటేకర్ పోస్ట్​ చేశారు. మూవీ ట్రైలర్​ వీడియోను షేర్​ చేసి, ‘‘రూల్స్​ ప్రకారం నడవని ఒక లవ్​ స్టోరీని చూసేందుకు సిద్ధంకండి. దీన్ని తొలిసారిగా టీవీలో చూడండి. జూన్​ 28న రాత్రి 9 గంటలకు ఓ రోమియోను జీ సినిమాలో చూడండి” అని పాటేకర్​ ఆ పోస్టులో రాసుకొచ్చారు.