Actor Imran Khan 
సినిమా

‘‘భారత్ విడిచి వెళ్లిపోండి’’.. ఇమ్రాన్​ ఖాన్​కు షాక్

రాజకీయ నిరసనల్లో పాల్గొని ఇమిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినందుకు అమెరికా పౌరసత్వం ఉన్న నటుడు ఇమ్రాన్ ఖాన్‌ను దేశం విడవాల్సిందిగా ముంబై పోలీసులు ఆదేశించారు.

Haji Pasha

ముంబై: అక్టోబర్​ 28లోగా భారత్​ను విడిచి వెళ్లిపొమ్మంటూ బాలీవుడ్​ నటుడు 43 ఏళ్ల ఇమ్రాన్​ ఖాన్​కు ముంబై పోలీసులు నోటీసులిచ్చారు. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్​ ‘ఇమిగ్రేషన్​ అండ్​ ఫారినర్స్ యాక్ట్’లోని నిబంధనలను ​​​ఉల్లంఘించారనే అభియోగాలతో గురువారం ఈ నోటీసులను జారీ చేశారు. “నటుడు ఇమ్రాన్​ ఖాన్​ భారతీయుడు కాదు. ఆయనకు విదేశీ పౌరసత్వం ఉంది. ‘ఇమిగ్రేషన్​ అండ్​ ఫారినర్స్ యాక్ట్’ ప్రకారం భారతగడ్డపై జరిగే రాజకీయ నిరసనల్లో విదేశీయులు పాల్గొనడానికి వీల్లేదు. ఆ చట్టంలోని నిబంధనలను ఇమ్రాన్​ ఉల్లంఘించారు. అందుకే అక్టోబర్​ 28లోగా భారత్ విడిచి వెళ్లాలంటూ ఆయనకు అధికారిక సమన్లు ఇచ్చాం. దాని ప్రతులను ఇమ్రాన్​ అందుకున్నారు. దీనిపై ఫారినర్స్​ రీజనల్ రిజిస్ట్రేషన్​ ఆఫీసర్​ (ఎఫ్​ఆర్​ఆర్​ఓ) ​నుంచీ ఆయనకు ఆదేశాలు అందాయి” అని ముంబై పోలీసు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమన్లు, ఆదేశాలను చట్టపరంగా సవాల్​ చేస్తామని ఇమ్రాన్​ ఖాన్​ తరఫు న్యాయవాది జుల్ఫిఖార్​ మెమన్ వెల్లడించారు. దీనిపై అత్యవసర విచారణను కోరుతూ ఇంకొన్ని రోజుల్లోగా బాంబే హైకోర్టులో పిటిషన్​ వేస్తామన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్​ చంద్ర త్రిపాఠి, న్యాయమూర్తి జస్టిస్ అద్వైత్​ సేథ్నాలతో కూడిన డివిజన్​ బెంచ్ ఈ పిటిషన్​ను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

10న నిరసనల్లో పాల్గొన్న ఇమ్రాన్​

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్​ ఖాన్​కు స్వయానా మేనల్లుడే (సోదరి కుమారుడు) ఇమ్రాన్​ ఖాన్. ఆయన అమెరికాలో జన్మించారు. అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ,  ఓవర్సీస్​ సిటిజెన్​ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు ద్వారా భారత్​లోనే ఇమ్రాన్​ నివసిస్తున్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్​ (సీఈసీ) జ్ఞానేశ్​ కుమార్ రాజీనామాను డిమాండ్​ చేస్తూ ముంబైలోని ఆగస్ట్​ క్రాంతి మైదాన్​లో అక్టోబరు 10న కాక్రోచ్​ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన ​నిరసనల్లో ఇమ్రాన్​ ఖాన్ పాల్గొన్నారు. ఆ రోజున ఆయన్ను పోలీసులు కాసేపు నిర్బంధించారు. “నేను ఏ రాజకీయ పార్టీకీ మద్దతుదారుడిని కాదు” అని ఆ సందర్భంగా ఇమ్రాన్​ వ్యాఖ్యానించారు. తాజాగా భారత్​ విడిచి వెళ్లాలంటూ ఆయనకు నోటీసులిచ్చారు. ఈ పరిణామాన్ని బీజేపీ మాజీ ఎంపీ కిరీట్​ సోమయ్య స్వాగతించారు. ఇమ్రాన్​ భారత్​లో రాజకీయ నిరసనల్లో పాల్గొనడంపై కేంద్ర ప్రభుత్వ శాఖలకు తానే ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగితే ఇంకొంత మంది పేర్లు బయటకు వస్తాయన్నారు.

భయంలో ఉన్నందు వల్లే ఇలాంటి చర్యలు : విపక్షాలు

ఇమ్రాన్​ ఖాన్​కు నోటీసుల జారీపై విపక్ష నేతలు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం భయంలో ఉన్నందు వల్లే ఇవన్నీ చేస్తోందని శివసేన (ఉద్ధవ్​) పార్టీ నేత సంజయ్​ రౌత్​ విమర్శించారు. లైంగిక దాడులు, హత్యలు చేసిన వాళ్లు పలు రాష్ట్రాల సీఎంలుగా చలామణి అవుతుంటే, కేవలం నిరసనల్లో పాల్గొన్న ఇమ్రాన్​పై చర్యలు తీసుకోవడం దారుణమని ఎన్​సీపీ(ఎస్​పీ) వర్కింగ్​ ప్రెసిడెంట్​ సుప్రియా సూలే  అన్నారు.