ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసుతో ముడిపడిన మరిన్ని కీలక విషయాలు వెలుగుచూశాయి. గురువారం వరకు 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు హర్యానా, ఇద్దరు ఉత్తరప్రదేశ్, ఒకరు బిహార్, మరొకరు మహారాష్ట్ర వాస్తవ్యులు. ఆదివారం (అక్టోబరు 18న) సాయంత్రం టైగర్ ష్రాఫ్ కారుపై హృతిక్ కుమార్(బిహార్), రేహాన్(హర్యానా), ఓ మైనర్ (హర్యానా) కలిసి కాల్పులు జరిపారు. వీరిలో ఇద్దరు నిందితులు కాల్పులు జరపడానికి ముందు, ముంబై అంధేరీ ఏరియా సమీపంలో తాము బస చేసిన హోటల్ రూంలో మూడు రౌండ్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక నిందితుడు రెండు రౌండ్లు, మరో దుండగుడు ఒక రౌండ్ ఫైరింగ్ చేశాడని తెలిపారు. వీరు ప్రాక్టీస్ చేసే క్రమంలో తుపాకీ జామ్ కావడంతో గురి తప్పి బెడ్‌ను ఒక బుల్లెట్ తాకినట్లు తేల్చారు.
ఢిల్లీ నుంచి ముంబైకి ఆయుధాల సప్లయ్
పోలీసుల కథనం ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్ నిర్దేశం మేరకు హర్యానాకు చెందిన కునాల్, సుమిత్ 20 కార్ట్రిడ్జ్లు, ఒక తుపాకీని అమృత్‌సర్‌లో తీసుకున్నారు. వీరిద్దరు అక్టోబరు 15న ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకొని రాధ(యూపీ), బబిత(యూపీ)లకు ఆయుధాలు, మందుగుండును అప్పగించారు. ఆ మహిళలు అక్టోబర్ 17న ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఒక హోటల్లో బస చేశారు. తదుపరిగా ఈ ఆయుధాలను షూటర్లకు అందించారు. ఆ వెంటనే రాధ, బబిత ట్రైన్లో ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. ఇది జరిగిన మరుసటి రోజే (ఆదివారం) టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగాయి.
పుణ్యక్షేత్రాల దర్శనం కోసమే ముంబైకి
పోలీసులు రాధ, బబితలను అరెస్టు చేసి ప్రశ్నించగా, పుణ్యక్షేత్రాల దర్శనం కోసమే తాము ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లామని చెప్పడం గమనార్హం. బబిత యూపీలోని ఆజంగఢ్ వాస్తవ్యురాలు. ఆమె హర్యానాలోని సోనీపట్‌లో ప్యాకర్‌గా పనిచేస్తోంది. ‘‘ఒకవేళ బబిత తప్పు చేసిందని తేలితే, తప్పకుండా శిక్షించాలి. ఆయుధాల స్మగ్లింగ్‌లో భాగమైన విషయం కూడా బబితకు తెలియదు” అని ఆమె కుటుంబీకులు తెలిపారు. తన కూతురు అమాయకురాలని, ఆమెను ఎవరైనా తప్పుదోవ పట్టించి ఉండొచ్చని రాధా తల్లి మైనా చెప్పుకొచ్చారు.
మిగతా నలుగురు నిందితులు వీరే
మిగతా నలుగురు నిందితుల్లో సమీర్, రాజేశ్ కటక్, అంకిత్, నితిన్ ఉన్నారు. కాల్పులకు పాల్పడిన ముగ్గురికి, అనిల్ పండిట్‌కు మధ్య అనుసంధానకర్తగా సమీర్ (హర్యానా) వ్యవహరించాడు. ఇక ముంబైలో షూటర్లకు రాజేశ్ కటక్ (మహారాష్ట్ర) సాయం చేశాడు. ఈ కుట్రలో భాగస్వాములుగా హర్యానాకే చెందిన అంకిత్, నితిన్ వ్యవహరించారు.
హృతిక్ బైక్ ట్యాక్సీ – కారుపై కాల్పులు
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం నిందితులకు ప్రత్యక్షంగా సహకరించిన 22 ఏళ్ల హృతిక్ కుమార్ బిహార్‌లోని బెగుసరాయ్ వాస్తవ్యుడు. అతడు ఇంటర్ వరకు చదువుకున్నాడు. రెండేళ్ల క్రితమే ఢిల్లీకి చేరుకొని ఒక క్యాటరింగ్ ఏజెన్సీలో పనికి కుదిరాడు. తాజాగా మూడు నెలల క్రితం ముంబైకి చేరుకొని ఒక రెస్టారెంట్లో వంటపనులు చేయడం మొదలుపెట్టాడు. తదుపరిగా బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా వర్క్ చేయడం మొదలుపెట్టాడని పోలీసులు గుర్తించారు. టైగర్ ష్రాఫ్‌పై దాడి సమయంలో హృతిక్ కుమార్ పసుపు రంగు పల్సర్ బైక్‌ను నడిపాడు. అతను బైక్ నడుపుతుండగా, వెనుక కూర్చున్న మిగిలిన ఇద్దరు నిందితులు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపారు.