Tiger Shroff 
సినిమా

సల్మాన్ను ప్రశంసించినందుకే ‘ఫ్రాఫ్’పై కాల్పులు..?

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులకు సల్మాన్‌ ఖాన్‌ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.

Boddupalli Naresh

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ను ప్రశంసించడమే నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల దాడికి కారణమైందా? లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడొకరు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. 2022లో ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో టైగర్‌ ష్రాఫ్‌ మాట్లాడుతూ ‘సినీ పరిశ్రమలో సల్మాన్‌ ఖాన్‌ మాత్రమే అసలైన టైగర్‌’ అని వ్యాఖ్యానించారని నిందితుడు తెలిపినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. సల్మాన్‌కు సన్నిహితంగా ఉండేవారిని గతంలోనూ ఈ గ్యాంగ్‌ లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ఈ కామెంట్స్​ దాడికి ప్రేరణగా మారి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం ముంబైలోని జుహూలో ఫుట్‌బాల్‌ ఆడిన అనంతరం బయటకు వస్తున్న టైగర్‌ ష్రాఫ్‌ కారుపై ఇద్దరు షూటర్లు ఏడు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో ష్రాఫ్​ డ్రైవర్‌, మరో వ్యక్తి గాయపడ్డారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడొకరు దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. మరుసటి రోజు సూరత్‌ నుంచి జైపూర్‌ వెళ్తున్న రైలులో వెళ్తుండగా కోటా రైల్వేస్టేషన్‌లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

సోషల్‌ మీడియాలో దర్యాప్తు సమాచారం?

టైగర్‌ ష్రాఫ్‌పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు పురోగతిని నిందితులు సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. నిందితుడు రెహాన్‌ తరచూ ఫోన్‌ వినియోగిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇంటర్నెట్‌ కాల్స్‌ ద్వారా దర్యాప్తు వివరాలు నిందితులకు చేరవేస్తున్నారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు ఉపయోగించిన బైక్​ అంధేరీలో లభ్యమైందని, వారు రైలులో ప్రయాణిస్తున్నట్లు మెసేజ్​ల ద్వారా సమాచారం అందినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. కాగా, నిందితులకు దర్యాప్తు వివరాలను చేరవేస్తున్న వ్యక్తులెవరో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఒక్క ఫోన్‌కాల్‌తో చిక్కిన షూటర్లు

పోలీసుల నుంచి దొరక్కుండా కాల్పుల అనంతరం నిందితులు తమ మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్​ను ఆఫ్​ చేశారు. షూటర్లు, వారికి సూచనలు ఇచ్చిన వ్యక్తులు ఇంటర్నెట్‌ ఆధారిత వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ (వీఓఐపీ) కాల్స్‌ ద్వారా మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, నిందితులు చేసిన ఒక్క ఫోన్‌కాల్‌ దర్యాప్తులో కీలకంగా మారింది. కాల్పుల అనంతరం అంధేరీ నుంచి బొరివలీకి లోకల్‌ రైలులో వెళ్లిన నిందితులు.. అక్కడి నుంచి ఓ క్యాబ్‌లో సూరత్‌ చేరుకున్నారు. క్యాబ్‌ డ్రైవర్‌కు చేసిన ఫోన్‌కాల్‌ ఆధారంగా వారి ప్రయాణ మార్గాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ముంబై పోలీసుల యాంటీ ఎక్స్‌టార్షన్‌ సెల్‌ టీం సూరత్‌కు వెళ్లి క్యాబ్‌ డ్రైవర్‌ను విచారించింది. అతడు నిందితులను సూరత్‌ రైల్వేస్టేషన్‌ వద్ద దించినట్లు చెప్పాడు. అక్కడి సీసీటీవీ దృశ్యాలు, రిజర్వేషన్‌ చార్టులను పరిశీలించిన పోలీసులు.. నిందితులు జైపూర్‌ రైలు ఎక్కినట్లు గుర్తించారు. అనంతరం రాజస్థాన్‌లోని కోటా వద్ద ముగ్గురు ప్రధాన షూటర్లను అదుపులోకి తీసుకున్నారు. దాడికి ఉపయోగించిన ఆయుధాలను సరఫరా చేసినట్లు అనుమానిస్తున్న ఇద్దరు మహిళలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని సూరత్‌ నుంచి రెండు తుపాకులు, పది బుల్లెట్లను ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ స్వాధీనం చేసుకుంది.