సినిమా

దళపతిని కలిసిన రణబాలి దంపతులు

రణబాలి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మంధాన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

M. Suresh

చెన్నై: రణబాలి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మంధాన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి దళపతి విజయ్‌ను కలిసిన దేవరకొండ దంపతులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దళపతితో కలిసి తీసుకున్న ఫొటోలను విజయ్ దేవరకొండ, రష్మికా మంధాన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘దళపతి విజయ్ సార్‌తో అద్భుతమైన సమయం గడిపాం. రోజంతా వరుస కార్యక్రమాలతో అలసిపోయినప్పటికీ, ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. వ్యక్తిగత అంశాల నుంచి పని, ప్రపంచం వరకు అనేక విషయాలను పంచుకున్నారు. మొదటి మీటింగ్‌లోనే సార్‌కు అభిమానిగా మారిపోయా. మరోసారి కలిసేంత వరకు ఆయనపై ప్రేమ, గౌరవం ఇలాగే కొనసాగుతాయి’ అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. చాలాకాలం తర్వాత విజయ్‌ను కలిశానని రష్మికా మంధాన అన్నారు. ‘దళపతి విజయ్‌కు అభిమానిగా ఉండటం, ఆయనతో కలిసి పని చేయడం, ప్రజాసేవకుడిగా ఆయనను ఆరాధించడం వరకు విజయ్ ప్రయాణం అద్భుతమైనది’ అని రష్మికా రాసుకొచ్చారు. అయితే, ఈ ఏడాది మొదట్లో వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మికా మంధాన పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం రణబాలి ఈ నెల 16న థియేటర్లలో సందడి చేయనున్నది. గతంలో వీరిద్దరూ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో అలరించారు. 1870లలో బ్రిటిష్ పాలనలో జరిగిన ఇతివృత్తంతో తెరకెక్కిన రణబాలి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.