HOME

ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులు పెంపు

- భారతీయులపై మరింత భారం

Suryanarayana

అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరో బాంబు పేల్చారు. అందులో భాగంగా  పెట్టుబడి ఆధారిత ఈబీ-5 గ్రీన్‌కార్డు దరఖాస్తుల ఫీజులను భారీగా పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రోగ్రామ్‌లోని కొన్ని దరఖాస్తుల ఫీజులను ఏకంగా రెట్టింపు చేయడం బెంబేలెత్తిస్తోంది. ఈ కొత్త ఫీజుల భారాన్ని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ సంస్థ ఖరారు చేసింది. సవరించిన ఫీజులు నవంబరు 30 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది.

ఈ ప్రోగ్రామ్‌ ద్వారా..

అమెరికా వాణిజ్యరంగంలో పెట్టుబడులు పెట్టి, అక్కడి పౌరులకు ఉద్యోగాలు కల్పించే విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఈబీ-5 ఇమిగ్రెంట్‌ ఇన్వెస్టర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అమెరికా గ్రీన్‌కార్డు పొందే అవకాశం ఉంటుంది. దీనిలో చాలా రకాల దరఖాస్తులున్నాయి. వాటికి సంబంధించిన ఫీజులను ఇప్పుడు మార్పులు చేశారు. దరఖాస్తుల పరిశీలన, బ్యాక్‌గ్రౌండ్‌ తనిఖీలు, అర్హతల ధ్రువీకరణ, మోసాలను గుర్తించడం లాంటి ప్రక్రియలకు అయ్యే ఖర్చులను భరించేందుకు రుసుములను పెంచినట్లు యూఎస్‌సీఐఎస్ తెలిపింది. స్టాండ్‌ఎలోన్‌ ఇన్వెస్టర్లు దాఖలు చేసే I-526 ఫామ్‌ దరఖాస్తు ఫీజును 3,675 డాలర్ల నుంచి 7,615 డాలర్లకు పెంచనున్నారు.

ఇండియన్స్‌పై ప్రభావం

యూఎస్ఏలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడం కోసం 1990లో యూఎస్‌ కాంగ్రెస్‌ ఈబీ-5 ప్రోగ్రామ్‌ను తెరపైకి తెచ్చింది. అందులో భాగంగా అమెరికా వ్యాపారాల్లో దరఖాస్తుదారులు 1.05 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే అందుకు సమానమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో 8 లక్షల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. అంతేకాదు కనీసం పది ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలను సృష్టించాలి. ఈ అర్హతలను పూర్తి చేసిన విదేశీ ఇన్వెస్టర్లు  వారి జీవిత భాగస్వామి, పిల్లలు కూడా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర ఇమిగ్రేషన్‌ కేటగిరీల మాదిరిగానే ఈబీ-5 వీసాల జారీకి వార్షిక పరిమితి ఉంటుంది. అదేవిధంగా దేశాలను బట్టి  కూడా వీసాలపై చాలా రకాల పరిమితులు ఉన్నాయి. ఈ ఈబీ-5 వీసాల కోసం భారతీయుల నుంచి పదేళ్లుగా డిమాండ్‌ బాగా పెరిగింది. ట్రంప్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఇప్పటికే ఉన్న పెట్టుబడి, ఇమిగ్రేషన్‌ ఖర్చులతో పాటు మరింత ఆర్థిక భారం పడనుంది.