Italy air traffic control network glitch 192 flights cancelled 
అంతర్జాతీయం

ఇటలీలో 192 విమానాలు రద్దు.. అసలేం జరిగింది?

తక్కువ ధరల విమాన సేవల సంస్థ ఈజీజెట్ క్యాబిన్ సిబ్బంది 24 గంటల సమ్మె కూడా అదనపు అంతరాయాలకు కారణమయ్యే అవకాశం ఉందని మిలాన్ విమానాశ్రయాల సంస్థ తెలిపింది.

Madhu

రోమ్: ఇటలీలో విమానయాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు మద్దతుగా పనిచేసే డాటా ట్రాన్స్‌మిషన్ (ఏటీసీ) నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో 192 విమానాలు రద్దు కాగా, పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 డాటా నెట్‌వర్క్‌లో సాంకేతిక లోపాలు

ఇటలీకి చెందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంస్థ (ఈఎన్ఏవీ) ప్రకారం, గురువారం అర్ధరాత్రి తర్వాత దేశవ్యాప్తంగా విమాన రాకపోకల నియంత్రణకు ఉపయోగించే డాటా ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌లో సమస్యలు గుర్తించారు. శుక్రవారం ఉదయం విమానాల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణ భద్రతకు ప్రాధాన్యమిస్తూ విమానాల నిర్వహణ సామర్థ్యంపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. దీంతో ఇటలీ గగనతలంలో ఒకేసారి నిర్వహించగల విమానాల సంఖ్య తగ్గింది.

 ఉపగ్రహ నెట్‌వర్క్‌తో సేవల పునరుద్ధరణ

సాంకేతిక సమస్యను అధిగమించేందుకు ఈఎన్ఏవీ ప్రత్యామ్నాయ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను వినియోగించింది. దీంతో విమానాశ్రయాల నిర్వహణ సామర్థ్యం సుమారు 75 శాతానికి పునరుద్ధరించినట్లు సంస్థ వెల్లడించింది. ప్రధాన డాటా నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతిక నిపుణులు, సంబంధిత సేవల సరఫరాదారులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటన వెనుక సైబర్ దాడి లేదా ఉద్దేశపూర్వక విధ్వంసం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.

 24 గంటల సమ్మె ఎఫెక్ట్?

రోమ్ విమానాశ్రయాల నిర్వాహక సంస్థ (ఏడీఆర్), మిలాన్ విమానాశ్రయాల సంస్థ (ఎస్ఈఏ) ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. ఇదిలా ఉండగా, తక్కువ ధరల విమాన సేవల సంస్థ ఈజీజెట్ క్యాబిన్ సిబ్బంది 24 గంటల సమ్మె కూడా అదనపు అంతరాయాలకు కారణమయ్యే అవకాశం ఉందని మిలాన్ విమానాశ్రయాల సంస్థ తెలిపింది.