అరుణా మిల్లర్ 1964 నవంబర్ 6న హైదరాబాద్‌లో జన్మించారు. ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ చదివి 1989లో పట్టా పొందారు. అనంతరం మేరీల్యాండ్‌లోని మాంట్‌గోమరీ కౌంటీలో రవాణా, ప్రజా మౌలిక సదుపాయాల రంగాల్లో 25 ఏళ్లపాటు పనిచేశారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, పాఠశాలలు, కార్యాలయాలకు మెరుగైన రవాణా సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
రాజకీయ ప్రస్థానం..
2010లో మేరీల్యాండ్ ప్రతినిధుల సభకు పోటీ చేయడంతో ఆమె రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 2010 నుంచి 2018 వరకు 15వ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సమయంలో శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్, గణిత విద్య, చిన్న వ్యాపారాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. 2018లో అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసినప్పటికీ, మేరీల్యాండ్‌లోని ఆరో కాంగ్రెస్ నియోజకవర్గ డెమోక్రటిక్ ప్రైమరీలో ఓటమి పాలయ్యారు. 2022లో గవర్నర్ అభ్యర్థిగా పోటీ చేసిన వెస్ మూర్తో కలిసి డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. నవంబర్ 8న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో 2023 జనవరి 18న ఉప గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తద్వారా మేరీల్యాండ్ రాష్ట్రానికి పదో ఉప గవర్నర్‌గా విజయం సాధించిన తొలి వలసదారుగా, తొలి శ్వేతజాతీయేతర మహిళగా చరిత్ర సృష్టించారు. అమెరికాలో ఉప గవర్నర్‌గా ఎన్నికైన తొలి దక్షిణాసియా మహిళగానూ గుర్తింపు పొందారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భగవద్గీతపై చేయి ఉంచి ప్రమాణం చేయడం విశేషం.
2026 ఎన్నికలే లక్ష్యంగా..
ప్రస్తుత గవర్నర్ వెస్ మూర్తో కలిసి అరుణా మిల్లర్ 2026 మే 2న బాల్టిమోర్‌లో మరోసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడం, గృహ నిర్మాణం, విద్యుత్ బిల్లుల భారాన్ని నియంత్రించడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, నేరాలను తగ్గించడం వంటి అంశాలను ప్రధాన హామీలుగా ప్రకటించారు. చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత రంగాల్లో విద్యార్థులకు మెరుగైన అవకాశాల కల్పనపైనా దృష్టి సారించారు. జూన్ 23న జరిగిన డెమోక్రటిక్ పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో ఈ జోడీ 5,58,768 ఓట్లు సాధించింది. ఇది మొత్తం ఓట్లలో 88.26 శాతం కావడం గమనార్హం.
రహదారి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం
రవాణా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అరుణా మిల్లర్ ఉప గవర్నర్‌గా రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 2023 మార్చిలో బాల్టిమోర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు రహదారి కార్మికులు మరణించడంతో ఆమె నేతృత్వంలో రోడ్డు పనుల ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీని ఫలితంగా 2024 ఏప్రిల్‌లో మేరీల్యాండ్ రోడ్ వర్కర్ ప్రొటెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చారు. రోడ్డు మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాల్లో ఆటోమేటిక్ వేగ నియంత్రణ నిఘా వ్యవస్థను విస్తరించడంతోపాటు అతివేగంగా వెళ్లే వాహనాలకు జరిమానాలను పెంచారు. కార్మికులు విధుల్లో ఉన్నప్పుడు జరిమానాలను రెట్టింపు చేసే నిబంధననూ ప్రవేశపెట్టారు. ఈ నిబంధనల అమలులో భాగంగా 2024లో రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అతివేగానికి సంబంధించి 4,43,339 జరిమానాలు జారీ అయ్యాయి. కొత్త జరిమానా విధానం అమల్లోకి వచ్చిన 2025లో ఈ సంఖ్య 3,67,266కు తగ్గింది. అంటే 17 శాతం తగ్గుదల నమోదైంది. కఠినమైన నిఘా కారణంగా వాహనదారుల్లో మార్పు వస్తోందని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే జరిమానాల సంఖ్య ఒక్కటే రహదారి భద్రతలో వచ్చిన పూర్తి మార్పును నిర్ధారించలేదని కూడా స్పష్టం చేశారు.
ఇతర రంగాల్లోనూ సేవలు
రహదారి భద్రతతోపాటు విద్యలో సమాన అవకాశాలు, మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణ వంటి అంశాలపైనా మిల్లర్ పనిచేస్తున్నారు. వివిధ మతాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, సామరస్యాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన మేరీల్యాండ్ కౌన్సిల్ ఆన్ ఇంటర్ఫెయిత్ ఔట్రీచ్కు కూడా ఆమె అధ్యక్షత వహిస్తున్నారు. ఇంజినీరింగ్ వృత్తి నుంచి రాజకీయ నాయకత్వ స్థాయికి ఎదిగిన అరుణా మిల్లర్ ప్రస్థానం అమెరికాలో భారత సంతతి మహిళల ప్రాతినిధ్యానికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. మరోవైపు వెస్ మూర్తో కలిసి చేపట్టిన పాలన, అమలు చేసిన కార్యక్రమాలు, రాబోయే నాలుగేళ్ల ప్రణాళికలపై మేరీల్యాండ్ ఓటర్లు నవంబర్ 2026 ఎన్నికల్లో తమ తీర్పు ఇవ్వనున్నార