PM Modi Congratulates Lula Da Silva 
అంతర్జాతీయం

నాలుగోసారి దేశాధ్యక్షుడిగా లూలా దా

బ్రెజిల్ ఎన్నికల్లో లూయిజ్ ఇనాసియో లూలా దా సిల్వా 51.75% ఓట్లతో చారిత్రాత్మక విజయం సాధించి నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Haji Pasha

బ్రసీలియా: బ్రెజిల్ దేశాధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇనాసియో లూలా దా సిల్వా చారిత్రాత్మక విజయం సాధించి, నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో తన ప్రధాన ప్రత్యర్థి, సెనేటర్ ఫ్లావియో బోల్సోనారోను ఆయన ఓడించారు. ఈ పోల్స్​లో లూలాకు 51.75 శాతం ఓట్లు,  బోల్సోనారోకు 48.25 శాతం ఓట్లు వచ్చాయి. లాటిన్ అమెరికాలో అమెరికా ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించే లూలా దా సిల్వా సాధించిన విజయం ప్రాధాన్యం సంతరించుకుంది. తన విజయంపై లూలా స్పందిస్తూ.. ‘‘బ్రెజిల్ ప్రజలు వీధుల్లోనూ, ఓట్ల ద్వారానూ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రజాస్వామ్యం గెలిచింది. ఆశ బలం పుంజుకుంది. మా దేశం ముందుకు సాగుతోంది” అని వ్యాఖ్యానించారు.

లూలా దాతో కలిసి పనిచేస్తాం: మోదీ

ఈనేపథ్యంలో సోమవారం లూలా దా సిల్వాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-బ్రెజిల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేస్తామని ఆయన వెల్లడించారు. గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) ప్రయోజనాల కోసం లూలాతో చేతులు కలపడానికి తాను ఎదురుచూస్తున్నట్లు మోదీ చెప్పారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకుంటూ, మరింత సమతుల్యమైన, స్థిరమైన ప్రపంచం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.

సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసిన నేతగా రికార్డు

లూలా దా సిల్వా వయస్సు 80 ఏళ్లు. ఆయన తొలిసారిగా 1989లో దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే 2002, 2006 పోల్స్​లో విజయఢంకా మోగించారు. లూలా దా సిల్వా 2018లో అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లారు. కానీ ఆ తర్వాత కోర్టు ఆ తీర్పును రద్దు చేసింది. మళ్లీ 2022లో మూడోసారి బ్రెజిల్​ అధ్యక్షుడయ్యారు. తాజాగా 2026 ఎన్నికల్లోనూ వర్కర్స్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి నాలుగోసారి గెలిచారు. ఈ విజయంతో ప్రపంచంలోనే సుదీర్ఘకాలం దేశాధ్యక్షుడిగా పనిచేసిన ప్రజాస్వామ్య దేశ నేతగా ఆయన నిలిచారు.