ప్రభాత ఉదయం, లాస్ ఏంజెలిస్: కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజెలిస్ కౌంటీలోని ఆర్కాడియా సిటీలో సరోగసీ ద్వారా ఏకంగా 21 మంది పసిపిల్లలను తెచ్చుకుని, వారిని ఇంట్లోనే చిత్రహింసలకు గురిచేసిన 'హౌస్ ఆఫ్ హారర్స్' దారుణం మనసును తీవ్రంగా కలచివేస్తోంది. తమ బాధను ఏడుపుతో తప్ప మాటల్లో కూడా చెప్పుకోలేని పసిమొగ్గలపై ఆ రాక్షసత్వం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
సమాజంలో అత్యంత సురక్షితమైన ప్రదేశం ఏది? అంటే ఎవరైనా 'ఇల్లు' అనే చెబుతారు. కానీ లాస్ ఏంజెలిస్‌లో వెలుగుచూసిన 'హౌస్ ఆఫ్ హారర్స్' ఉదంతం వింటే, ఆ ఇల్లే నరకకూపంగా ఎలా మారిందో అర్థమై గుండె తరుక్కుపోతుంది. సరోగసీ ద్వారా ఏకంగా 21 మందికి పైగా పిల్లలను కన్న దంపతులు, వారిని పెంచకపోగా పసికందుల ఎముకలు విరిగేలా, శరీరంపై వాతలు పడేలా హింసించారన్న వార్త మానవాళికే ఒక మాయని మచ్చ.
డబ్బే సర్వస్వం అనుకుని చట్టాల్లోని లొసుగులతో అంతమంది పిల్లలను కొనుక్కున్నట్లు తెచ్చుకోవడమే ఒక వికృతం అయితే, ప్రేమ పంచాల్సిన చేతులతోనే గాయాలు చేయడం క్షమించరాని నేరం. సకాలంలో వైద్యులు స్పందించి బయటపెట్టబట్టి మిగిలిన పిల్లల ప్రాణాలైనా దక్కాయి.
అది లాస్ ఏంజెలిస్ సమీపంలోని సంపన్న ప్రాంతమైన ఆర్కాడియా నగరంలోని నాలుగు మిలియన్ డాలర్ల విలాసవంతమైన భవనం. అందులో చైనా సంతతికి చెందిన 65 ఏళ్ల గువోజున్ జువాన్, 38 ఏళ్ల సిల్వియా జాంగ్ నివసిస్తున్నారు. వీరి వద్ద ఉన్న రెండు నెలల పసికందు తీవ్ర తలగాయం (విపరీతంగా ఊపిఊపి కొట్టడం వల్ల – షేకెన్ బేబీ సిండ్రోమ్)తో ఆస్పత్రికి చేర్చినప్పుడు గమనించిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ అనంతరం అక్టోబర్ 6, 2026న లాస్ ఏంజెలిస్ జిల్లా అటార్నీ ఆధ్వర్యంలో వారిద్దరిపై చైల్డ్ అబ్యూస్, కుట్ర అభియోగాల కేసులు నమోదుచేసి అరెస్టు చేశారు. వారి ఇంటిని ‘హౌస్ ఆఫ్ హారర్స్’గా అభివర్ణించారు. పోలీసులు ఆ భవనంలోని సీసీటీవీ కెమెరాలను, డజన్ల కొద్దీ సరోగసీ ఒప్పంద పత్రాలను పరిశీలించారు. దీంతో అసలు నిజాలు బయటపడ్డాయి.
పిల్లలను కేర్‌టేకర్లతో కలిసి దారుణంగా కొట్టించడం, తీవ్రంగా హింసించడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. విచారణ నిమిత్తం పిల్లలను సంరక్షణలోకి తీసుకున్నారు. వారి వద్ద రెండు నెలల పసికందు నుంచి 13 ఏళ్ల చిన్నారులు వరకు మొత్తం 21 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. సిల్వియా జాంగ్ ఒక్కరిద్దరికి జన్మనిచ్చి ఉంటుందని, మిగతా పిల్లలంతా సరోగసీ ద్వారానే పొందినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
వారు ఎందుకు అలా చేశారు?
తమకంటూ ఒక పెద్ద సామ్రాజ్యం లాంటి ‘మెగా ఫ్యామిలీ’ని నిర్మించాలనే తీవ్రమైన మానసిక వ్యామోహం వారిలో కనిపించింది. ఆ దంపతులు పిల్లలను ఒక బాధ్యతగా భావించలేదు. కేవలం తమ సంపదతో పోగుచేసే వస్తువుల్లా మాత్రమే భావించారు. ఇదో మానసిక రుగ్మతగా సైకాలజిస్టులు గుర్తించారు.
సంరక్షించడంలో విఫలం
డబ్బు ఉంది కాబట్టి సరోగసీ ద్వారా ఒకేసారి పదుల సంఖ్యలో పసికందులను తెచ్చుకున్నారు. వారికి అది చాలా తేలికైన విషయమే. కానీ వారందరినీ సంరక్షించడం చిన్న విషయం కాదు. పసికందుల ఆకలి-ఏడుపులను భరించడం వారి మానసిక శక్తికి మించిపోయింది. పిల్లల నిరంతర అవసరాలు, నిద్రలేమి, ఒత్తిడి వారిని తీవ్ర అసహనానికి, ఆవేశానికి గురిచేశాయి. ఆ అసహనాన్ని పసిపిల్లలపై ప్రదర్శించారు. వారిపై హించకు పాల్పడ్డారు.
కేర్టేకర్లను సరిగ్గా నిర్వహించలేకపోవడం
అంతమంది పిల్లల కోసం ఆయాలను పెట్టుకున్నారు. కానీ వారు కూడా నియంత్రించలేకపోయారు. బయటి ప్రపంచంతో ఎవ్వరూ సంబంధాలు పెట్టుకోకుండా ఇంటిని ఒక రహస్య బందిఖానాలాగా మార్చారు. ఏడుస్తున్న పిల్లలను ఊరుకోబెట్టే ఓపిక లేక దారుణంగా కొట్టడం, ఊపడం చేశారు.
చట్టాల డొల్లతనం
సరోగసీ ఏజెన్సీలు కేవలం డబ్బువస్తే చాలు అన్నట్లుగా వ్యవహరించడం తెలిసిందే. ఆ దంపతులు మానసికంగా అంతమందిని పెంచేందుకు తగినవారా? లేదా? అనేది ఎవ్వరూ పరిశీలించలేదు. ఆ వెసులుబాటుతోనే వారు వరుసగా పిల్లలను పుట్టించుకుంటూ పోయారు.
విపరీతమైన డబ్బుతో వచ్చిన అహంకారం, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే వికృతమైన భ్రమ, దానికితోడు అంతమందిని సాకలేకపోయిన అసహనం కలిసి ఆ పసికందుల జీవితాలను నరకంగా మార్చాయి.