China opposes India’s move to name 28 strategic locations in Ladakh 
అంతర్జాతీయం

భారత్ నిర్ణయంపై చైనా పేచీ

లద్దాఖ్‌లోని 28 ప్రాంతాలకు భారత్ పేర్లు ఖరారు చేయడాన్ని చైనా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు.

Madhu

బీజింగ్: లద్దాఖ్‌లోని 28 కీలక ప్రాంతాలకు భారత్ అధికారికంగా పేర్లు ఖరారు చేయడంపై చైనా స్పందించింది. భారత్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని, అది చెల్లబోదని స్పష్టం చేసింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ మంగళవారం బీజింగ్‌లో మీడియాతో మాట్లాడారు. లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా భారత్ పరిగణించడాన్ని తాము గుర్తించడంలేదన్నారు. సరిహద్దు ప్రాంతాలపై తమ వైఖరి మారదబోదన్నారు. ఆ ప్రాంతాలు తమవేనని మరోసారి వాదించారు. ఈ నెల 2న లద్దాఖ్‌లోని కీలక ప్రాంతాలు, పర్వతాలు, లోయలు, మంచు కొండలు, పర్వత మార్గాలకు భారత ప్రభుత్వం పేర్లను ఖరారు చేసింది. అనంతరం వాటిని భారత అధికారిక మ్యాప్‌లో గుర్తించింది. కేంద్ర హోం శాఖ లద్దాఖ్ పాలనా యంత్రాంగంతో కలిసి ఈ చర్యలు చేపట్టింది. ఆయా ప్రాంతాలను స్పష్టంగా గుర్తించడం, అధికారిక మ్యాప్‌లలో ఒకే విధమైన పేర్లు ఉపయోగించడం, ప్రజలకు సరిహద్దు ప్రాంతాల గురించి మరింత సమాచారం అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఈ జాబితాలో గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ వంటి కీలక ప్రాంతాలు కూడా ఉన్నాయి. 2020లో తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అదే ఏడాది మే 5న పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరు దేశాలు చర్చలు నిర్వహించాయి. 2022లో కొన్ని ప్రాంతాల్లో సైనిక బలగాలను వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ వంటి ప్రాంతాలకు ప్రాధాన్యం పెరిగింది.