వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు గర్భిణీలను భయపెడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు అది తల్లులు, పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైద్య పరిశోధనల ప్రకారం వేడిగాలులు గర్భిణీల పాలిట శాపంగా మారుతున్నాయి. ముందస్తు ప్రసవాలు, బలహీనంగా పుడుతున్న పిల్లలు, గర్భస్రావాలు వంటి ప్రమాదాలు భారీగా పెరుగుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఎడారి ప్రాంతాల మహిళలే కాకుండా సమశీతోష్ణ ప్రాంతాల్లో నివసించే కోట్లాది మంది తల్లులు కూడా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. గర్భిణీలపై ఉష్ణోగ్రతల ప్రభావం ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుందనే అంశంపై పరిశోధకులు లోతైన విశ్లేషణలు చేశారు. పెరుగుతున్న ప్రతి అదనపు డిగ్రీ ఉష్ణోగ్రతతో పిండం ఎదుగుదలపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. "భూమి వేడెక్కుతున్న ఈ సమయంలో ఎవరూ సురక్షితంగా లేరు. ముఖ్యంగా గర్భిణీలు అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు" అని వైద్య పరిశోధకురాలు డాక్టర్ లఖూ హెచ్చరించారు.
వైద్య రంగానికి కొత్త సవాళ్లు
వాతావరణం వేడెక్కడం వల్ల గర్భిణీలలో రక్తపోటు సమస్యలు పెరిగిపోతున్నాయి. ‘ప్రీఎక్లంప్సియా’ అనే రుగ్మత తల్లుల ప్రాణాలకే ముప్పుగా మారుతోంది. ఈ వ్యాధి కారణంగా కిడ్నీలు దెబ్బతినడం, గుండెపోటు రావడం వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో ఆసుపత్రులలో చేరే గర్భిణీల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాఫ్రికా, మెక్సికో వంటి దేశాలలో నిర్వహించిన పరిశోధనలలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్న కాలంలో ముందస్తు ప్రసవాల రేటు సాధారణం కంటే భారీగా పెరిగింది. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, శ్వాసకోస సమస్యలు తలెత్తడం వంటి ఇబ్బందులు చిన్నపిల్లలను జీవితాంతం వేధిస్తున్నాయి.
తగిన జాగ్రత్తలు అవసరం
పేదరికంలో మగ్గుతున్న మహిళలు, పెద్ద వయసున్న గర్భిణీలు ఈ అనారోగ్య సమస్యల బారిన ఎక్కువగా పడుతున్నారు."గర్భిణీలు తీవ్రమైన ఉష్ణోగ్రతలకు దూరంగా ఉండాలి. వైద్యులు కూడా సాధారణ పరీక్షలతో పాటు ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తప్పకుండా పరిశీలించాలి" అని ప్రముఖ వైద్య నిపుణులు మాథ్యూ చెరిష్ సూచించారు. వాతావరణ మార్పుల తీవ్రతను తట్టుకునేందుకు సమాజం సమిష్టిగా సిద్ధం కావాలి. గర్భిణీలు ఎండ తీవ్రతకు గురికాకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కార్యాలయాలు, నివాస ప్రాంతాలలో శీతల వసతులు కల్పించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ప్రభుత్వం తరఫున అవసరమైన సదుపాయాలు కల్పించి తల్లులకు, పసిపిల్లలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.