న్యూయార్క్ : భవిష్యత్‌లో ఏఐ, రోబోలతో సంపద సృష్టించబోతున్నామని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఇక మనుషులు ఏ కంపెనీలోనూ పని చేయాల్సిన అవసరం ఉండదని, వారికి సెలబ్రిటీల స్థాయిలో సంపాదన లభించబోతున్నదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఏఐ, రోబోలు 24గంటల పాటు పని చేసి ఏ రంగంలోనైనా ఉత్పత్తిని పెంచుతాయని తెలిపారు. దీంతో మానవాళి జీవన ప్రమాణాలు పెరిగే అవకాశమున్నదని చెప్పారు. ఇకపై వ్యక్తిగత మెరుగైన వైద్యం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఏఐ, రోబోల కలయికతో ఖరీదైన వైద్యం స్థానంలో ఉచిత సేవలు అందుబాటులోకి కూడా రావొచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, ఒకవైపు ఏఐ రాకతో ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశమున్న నేపథ్యంలో మస్క్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అదే ఏఐ ద్వారా సంపాదన పెరిగి మానవాళి మొత్తానికి ప్రయోజనం చేకూరుతుందనే వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏఐ, రోబోలు అందించే సంపద అందరికీ చేరుతుందా?.. కొన్ని వర్గాలకే పరిమితమవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. మస్క్ వ్యాఖ్యలు నిజమవ్వాలంటే సాంకేతిక అభివృద్ధితో పాటు సంపద సమంగా పంపిణీ, అందుబాటు ధరలు, ప్రభుత్వ విధానాలు వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.