Elon Musk alleged that approvals for Starlink services in India are being delayed 
అంతర్జాతీయం

భారత్‌లో స్టార్ లింక్ సేవలకు ఆ కుబేరులే అడ్డు

Sathyam

-ఉద్దేశపూర్వకంగా అనుమతులు రాకుండా కుట్ర

-స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

-మస్క్ ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్(స్టార్ లింక్) సేవలు అందకుండా కొందరు కుబేరులు అడ్డకుంటున్నట్లు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం రాత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత్‌లో సేవలు అందించేందుకు స్టార్ లింక్ సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతులకు సంబంధించిన ప్రక్రియ చివరి దశలో ఉండగా, ఉద్దేశపూర్వకంగా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. ‘ఇది భారత ప్రజలకు తీరని అన్యాయం..నేరం..వారెవరో ఆలోచించండి‘ అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. భారత్‌లో డిజిటల్ విప్లవం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ అత్యధిక గ్రామాల్లో ఇప్పటివరకు ఇంటర్నెట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని తెలిపారు. అత్యల్ప ధరల్లో స్టార్ లింక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టంచేశారు. ఇక ‘ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2026’ లో స్టార్ లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ బుధవారం మాట్లాడుతూ ఇండియాలో సేవలు అందించేందుకు ఇప్పటికే 20 గేట్ వే సైట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే అన్ని అనుమతులతో భారత్‌లో స్టార్ లింక్ తన సేవలను విస్తరిస్తుందని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టినా భారత్‌లో అనుమతులు ఆలస్యమవుతున్న నేపథ్యంలోనే పలువురిని లక్ష్యంగా చేసుకొని ఎలాన్ మస్క్ ఈ ఆరోపణలు చేసినట్లుగా నిపుణులు భావిస్తున్నారు.

మస్క్ ఆరోపణలను ఖండించిన కేంద్రం

కాగా, ఈ ఆరోపణలను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ తోసిపుచ్చింది. అనుమతుల ప్రక్రియ ఎలాంటి వివక్ష లేకుండా న్యాయబద్ధంగా ప్రక్రియ కొనసాగుతున్నదని ప్రకటించింది.  మస్క్ ఆరోపణలు నిరాధారమైనవి.. తప్పుదోవ పట్టించేవని కొట్టిపారేసింది.