Elon Musk's Tesla Roadster Flying Car 
అంతర్జాతీయం

గాల్లో ఎగిరి పల్టీలు కొట్టే కారు వచ్చేసింది

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా రోడ్‌స్టర్ గాల్లోకి ఎగిరే సామర్థ్యంతో రూపొందినట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణ రోడ్లపై వినియోగానికి భద్రతా అనుమతులు ఇంకా రావాల్సి ఉంది.

Srinivas Rao

టెక్సాస్: ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెర తీశారు. ఆయనకు చెందిన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా, రాకెట్ లాంచింగ్ కంపెనీ స్పేస్ ఎక్స్ జాయింట్ వెంచర్‌గా ఫ్లయింగ్ కార్ లాంచ్ చేశారు. ఇప్పటికే డ్రైవర్ లెస్ ఈవీలతో పాపులర్ అయిన టెస్లా కంపెనీ టెక్సాస్‌లోని స్టార్ బేస్ సెంటర్‌లో అత్యాధునిక ఫ్లయింగ్ రోడ్‌స్టర్‌ను ప్రదర్శించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సరికొత్త ఎగిరే స్పోర్ట్స్ కారు 0.81 సెకండ్లలో 96 కి.మీల వేగాన్ని అందుకుంటుంది. రాకెట్‌లలో ఉపయోగించే థ్రస్టర్స్, కారు కింది భాగంలో ఉండే ఫ్యాన్‌లతో జరిగే ప్రయాణం అద్భుతంగా ఉంటుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. టెస్లా సృష్టించిన ఈ అద్భుతంతో కళ్లు చెదరడం ఖాయం. ఇది విమానాల సాంకేతికతతో గాలిలోకి లేచే వాహనం కాదు. ఏకంగా స్పేస్‌ఎక్స్‌ రాకెట్ టెక్నాలజీతో రోడ్‌పై దూసుకెళ్లే కారు. అంతవేగంలోనూ రోడ్డుపై ఏదైనా వాహనం అడ్డువస్తే బ్రేకులు వేయాల్సిన పనేలేదు. ఒక మార్షల్ ఆర్ట్స్ వీరుడిలా గాల్లోకి జంప్ చేసి మరీ ప్రమాదాన్ని తప్పిస్తుంది. టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్ కేంద్రంలో అత్యాధునిక విద్యుత్ కారు రోడ్‌స్టర్‌ను ప్రదర్శించింది. ఒక ఎత్తైన వాలు మార్గంలో ఈ కారు తలకిందులుగా ప్రయాణించడంతో పాటు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి కాసేపు చక్కర్లు కొట్టి అత్యంత సురక్షితంగా నేలమీదకు వాలింది. స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేసిన కోల్డ్-గ్యాస్ థ్రస్టర్ల సాంకేతికత సాయంతో ఈ కార్‌ గాలిలో విన్యాసాలు చేసింది

 భవిష్యత్ తరానికి చెందిన కారు

టెస్లా రోడ్‌స్టర్ రాకెట్ బూస్టర్లను ఉపయోగించుకుని గాల్లోకి లేవడం ముందుకు దూసుకుపోవడం చేస్తుంది. టెస్లా, స్పేస్ ఎక్స్ టెక్నాలజీలతో రానున్న రోడ్‌స్టర్ రాకెట్ ఇంధనం ఉపయోగించుకుంటుంది. కారు అన్ని వైపులా ఉండే 10 థ్రస్టర్ల సాయంతో ఎటు కావాలంటే అటు కదిలేందుకు సెన్సర్లు ఉపయోగపడతాయి. కారు కింది భాగంలో ఉండే ఫ్యాన్స్ నుంచి విడుదలయ్యే గాలి సాయంతో  కావలసిన ఎత్తులో కారును స్థిరంగా ఉంచుకోవచ్చు. మలుపులు తిరిగేందుకు థ్రస్టర్‌లు ఉపయోగపడేలా ఫ్లయింగ్ కారును డిజైన్ చేశారు. గరిష్టంగా గంటకు 370 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ రోడ్‌స్టర్, భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్పోర్ట్స్ కారుగా రికార్డు సృష్టించనుంది. 2017లో తొలిసారి ఈ కారు గురించి టెస్లా ప్రకటించింది. రెండు సీట్లతో ఉండే ఈ ఫ్లయింగ్ కారుపై టెక్సాస్‌లోని రాకెట్ టెస్ట్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అన్ని పరీక్షలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ టెస్టుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రోడ్‌స్టర్ నిజంగా భవిష్యత్ తరానికి చెందినది అయినప్పటికీ, అవి రోడ్లపై ఎగరడానికి మరికొంత సమయం పట్టవచ్చు. అయితే, ఈ విన్యాసాలను పూర్తిగా నియంత్రిత వాతావరణంలో మాత్రమే నిర్వహించారు. సాధారణ రోడ్లపై ఈ కారు గాలిలోకి ఎగిరేందుకు భద్రతాపరమైన అనుమతులు ఇంకా లభించాల్సి ఉంది. 2028 కల్లా మార్కెట్లోకి రానున్న ఈ రోడ్‌స్టర్ ఫ్లయింగ్ కార్ జనం మనసును గెలుచుకుంటుందని మస్క్ నమ్మకంగా చెబుతున్నారు.