Pakistan Security Forces Kill Five Terrorists In Operation Radd-ul-Fitna-3 
అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో భద్రతా దళాల దాడులు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

బలూచిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ రద్దుల్‌ ఫిత్నా-3’లో భాగంగా బుధవారం వాషుక్‌ ప్రాంతంలో భద్రతా దళాలు చేసిన దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Madhu

కరాచీ: పాకిస్తాన్‌ భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. స్థానిక టెలివిజన్‌ సంస్థ పీటీవీ కథనం ప్రకారం.. బలూచిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు చేపట్టిన ‘ఆపరేషన్‌ రద్దుల్‌ ఫిత్నా-3’లో భాగంగా బుధవారం వాషుక్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాలపై భద్రతా దళాలు దాడులు చేశాయి. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఘటనా స్థలంలో అధునాతన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

ప్రత్యేక నిఘా

కొద్దిరోజులుగా వేర్పాటువాద తిరుగుబాటు గ్రూపులతోపాటు నిషేధిత తెహ్రీక్ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తోనూ భద్రతా దళాలు పోరాడుతున్నాయి. ఇటీవల ఉగ్రవాద సంస్థలు వరుసగా దాడులకు పాల్పడటంతో గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలో భద్రతా దళాలు నిఘా పెట్టాయి. జూలైలో బలూచిస్తాన్‌లోని మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. జియారత్‌లోని మంగి డ్యామ్ వద్ద ఉన్న పోలీస్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడిలో 27 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. తొలుత తొమ్మిది మంది పోలీసులను హతమార్చిన ఉగ్రవాదులు, మరో 18 మందిని కిడ్నాప్ చేశారు. అనంతరం జియారత్ సమీపంలోని జర్ఘూన్ పర్వత ప్రాంతంలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక గత నెలలో కలాత్ ప్రాంతంలో హైవే చెక్‌పోస్ట్ నుంచి 23 మందిని అపహరించిన ఉగ్రవాదులపై భద్రతా దళాలు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమవ్వగా, కిడ్నాప్‌నకు గురైనవారిని సురక్షితంగా విడిపించారు.